ఆవాస్‌ ఫైనాన్సియర్స్‌ ఐపీవో 27న ముగింపు

ఆవాస్‌ ఫైనాన్సియర్స్‌ ఐపీవో 27న ముగింపు

రిటైల్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీ ఆవాస్‌ ఫైనాన్షియర్స్‌ లిమిటెడ్‌ పబ్లిక్‌ ఇష్యూ మంగళవారం(25న) ప్రారంభంకానుంది. గురువారం(27న) ముగియనున్న ఇష్యూకి ప్రైస్‌-బ్యాండ్‌(ఒక్కో షేరు) రూ. 818-821 కాగా.. తద్వారా కంపెనీ రూ. 1734 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. ఆఫర్‌లో భాగంగా 1.6 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచనుంది. వీటితోపాటు మరో 48.7 లక్షల షేర్లను సైతం కంపెనీ తాజాగా జారీ చేయనుంది. 

18 షేర్లు ఒక లాట్‌
ఆవాస్‌ ఫైనాన్షియర్స్‌ లిమిటెడ్‌ పబ్లిక్‌ ఇష్యూలో భాగంగా రిటైల్‌ ఇన్వెస్టర్లు కనీసం 18 షేర్లకు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఇంతకంటే అధికంగా షేర్లను పొందాలనుకుంటే రూ. 2 లక్షల విలువకు మించకుండా ఒకే లాట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. 

Image result for aavas financiers limited

కంపెనీ వివరాలివీ
దేశ పశ్చిమ, ఉత్తర ప్రాంతంలో కార్యకలాపాలు విస్తరించిన రిటైల్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీ ఆవాస్‌ ఫైనాన్షియర్స్‌ లిమిటెడ్‌. ఏయూ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌కు అనుబంధ సంస్థగా ప్రారంభమైంది. తదుపరి మెజారిటీ వాటాను పీఈ సంస్థలు కేదార కేపిటల్‌, పార్టనర్స్‌ గ్రూప్‌ కొనుగోలు చేశాయి. ప్రధానంగా  రాజస్తాన్‌, గుజరాత్‌, మహారాష్ర్ట, మధ్యప్రదేశ్‌లలో విస్తరించింది. 8 రాష్ట్రాల వ్యాప్తంగా 92 జిల్లాలలో 186 బ్రాంచీలను నెలకొల్పింది. రానున్న మూడేళ్లలో బ్రాంచీల సంఖ్యను 300కు పెంచుకోవాలని భావిస్తోంది. 2011లో ప్రారంభమైన కంపెనీ వ్యక్తిగత గృహ రుణాల మార్కెట్‌పై దృష్టి కేంద్రీకరించింది. రూ. 8 లక్షల సగటు రుణ పరిమాణంలో రిటైల్‌ రుణాలను అందిస్తోంది. లోన్‌బుక్‌లో రాజస్తాన్‌కు 50 శాతం వాటా ఉంది. రుణగ్రహీతల్లో 64 శాతంమంది స్వయం ఉపాధి మార్గంలో ఉన్నవారే కావడం గమనార్హం!

ఆర్థిక పనితీరు
గత నాలుగేళ్లలో లోన్‌బుక్‌ వార్షిక సగటున 78 శాతం వృద్ధి సాధించింది. 2018 మార్చికల్లా రూ. 4073 కోట్లను తాకింది. ఈ బాటలో ఆదాయం 70 శాతం పురోగతి సాధిస్తూ రూ. 457 కోట్లకు చేరగా.. రూ. 93 కోట్ల నికర లాభం ఆర్జించింది. వెరసి నికర లాభాల్లోనూ 80 శాతం సీఏజీఆర్‌ను సాధిస్తూ వచ్చింది. ఇక పరిశ్రమలోనే అత్యధిక స్థాయిలో 7.25 శాతం నికర వడ్డీ మార్జిన్లు(ఎన్‌ఐఎం) సాధిస్తోంది. స్థూల మొండిబకాయిలు(జీఎన్‌పీఏలు) 0.34 శాతంగా నమోదయ్యాయి. కంపెనీ ఫండమెంటల్స్‌ పటిష్టంగా ఉన్నప్పటికీ ఐపీవోకు ఆశిస్తున్న ధర గరిష్టస్థాయిలో ఉన్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. ప్రైస్‌ టు బుక్‌ వేల్యూ నిష్పత్తి(పీబీ-రేషియో) అంశంలో పరిశ్రమ సగటు 2.5 రెట్లుకాగా.. కంపెనీ 5 రెట్లు అధిక స్థాయిలో ఐపీవో ధరను నిర్ణయించినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతం మార్కెట్లో హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీల షేర్లలో అమ్మకాలు ఊపందుకున్న విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు.Most Popular