ఆర్‌బీఐ చెక్‌- కుప్పకూలిన యస్‌ బ్యాంక్‌!

ఆర్‌బీఐ చెక్‌- కుప్పకూలిన యస్‌ బ్యాంక్‌!

ఎండీ, సీఈవోగా రాణాకపూర్‌ 2019 జనవరి వరకే బాధ్యతలు నిర్వహించేందుకు రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) తాజాగా అనుమతించినట్లు యస్‌ బ్యాంక్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు తెలియజేసింది. ఈ ఏడాది ఆగస్ట్‌ 31న కపూర్ పదవీకాలం పూర్తికాగా.. అంతకుముందు 30న గడువు పొడిగింపునకు ఆర్‌బీఐ తాత్కాలికంగా అనుమతించింది. కాగా.. బ్యాంక్‌ ఈ ఏడాది జూన్‌లో నిర్వహించిన సమావేశంలో రాణాకపూర్‌ మరో మూడేళ్లపాటు పదవీ బాధ్యతలు నిర్వహించేందుకు వాటాదారుల నుంచి గ్రీన్‌సిగ్నల్‌ లభించిన సంగతి తెలిసిందే. దీంతో ఆందోళనకు లోనైన ఇన్వెస్టర్లు ఈ కౌంటర్లో భారీ అమ్మకాలకు ఎగబడుతున్నారు. ఫలితంగా ఎన్‌ఎస్ఈలో ప్రస్తుతం యస్‌ బ్యాంక్‌ షేరు 19 శాతం పతనమై రూ. 259 దిగువన ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో 30 శాతం వరకూ కుప్పకూలింది. రూ. 218ను తాకింది. ఇది 52 వారాల కనిష్టంకావడం గమనార్హం!

Image result for yes bank rana kapoor

25న మీటింగ్‌
ఆర్‌బీఐ 2019 జనవరి వరకూ సీఈవోగా బాధ్యతలు నిర్వహించేందుకు రాణాకపూర్‌ను అనుమతించినట్లు యస్‌ బ్యాంక్‌ తాజాగా స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు తెలియజేసింది. దీంతో భవిష్య కార్యాచరణపై చర్చించేందుకుగాను ఈ నెల 25న బోర్డు సమావేశంకానున్నట్లు బ్యాంక్‌ తెలియజేసింది. రాణా కపూర్‌ యస్‌ బ్యాంక్‌ వ్యవస్థాపక సీఈవోకాగా.. 2004 నుంచీ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. బ్యాంక్‌ మరో సహవ్యవస్థాపకులు అశోక్‌ కపూర్‌ 2008 నవంబర్‌ చివరిలో జరిగిన ఉగ్రదాడుల్లో మరణించిన విషయం విదితమే. ప్రమోటర్‌గా రాణా కపూర్‌తోపాటు, ఆయన కుటుబ సభ్యులకు ప్రస్తుతం బ్యాంకులో 10.66 శాతం వాటా ఉంది.

సీఈవోలపై ఒత్తిడి
యస్‌ బ్యాంక్‌ ఎండీ, సీఈవోగా మరో మూడేళ్లపాటు బాధ్యతలు నిర్వహించేందుకు రాణా కపూర్‌కు వాటాదారులు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినప్పటికీ ఆర్‌బీఐ నుంచి అనుమతి లభించకపోవడం గమనించదగ్గ అంశమని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇంతక్రితం యాక్సిస్‌ బ్యాంక్‌ సీఈవో శిఖా శర్మ విషయంలోనూ వాటాదారులు మూడేళ్లకు పదవీకాలాన్ని అనుమతించినప్పటికీ ఇందుకు ఆర్‌బీఐ చెక్‌పెట్టిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు. కాగా.. మరోపక్క ఐసీఐసీఐ బ్యాంక్‌ సీఈవో చందా కొచ్చర్‌పై వీడియోకాన్‌కు రుణాల మంజూరీ అంశంలో దర్యాప్తు జరుగుతున్న నేపథ్యంలో ప్రయివేట్‌ బ్యాంక్స్‌ సీఈవోలపై ఒత్తిడి పెరిగే అవకాశమున్నట్లు పరిశ్రమవర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. Most Popular