ఇర్కాన్‌ ఇంటర్నేషనల్‌ ఐపీవో సక్సెస్‌!

ఇర్కాన్‌ ఇంటర్నేషనల్‌ ఐపీవో సక్సెస్‌!

కేంద్ర ప్రభుత్వ సంస్థ ఇర్కాన్‌ ఇంటర్నేషనల్‌ పబ్లిక్‌ ఇష్యూ విజయవంతమైంది. బుధవారం(19న)తో ముగిసిన ఇష్యూకి దాదాపు 10 రెట్లు అధికంగా స్పందన లభించింది. ఇంజినీరింగ్‌, కన్‌స్ట్రక్షన్‌ సంస్థ ఇర్కాన్‌ ఐపీవోకు ప్రైస్‌బ్యాండ్‌ రూ. 470-475 కాగా...  ప్రభుత్వం 10 శాతం వాటాకు సమానమైన 99 లక్షలకుపైగా షేర్లను విక్రయించింది. తద్వారా రూ. 470 కోట్లు సమకూర్చుకుంది. 

బిడ్స్‌ తీరిలా
ఐపీవోలో భాగంగా ప్రభుత్వం 99 లక్షల షేర్లను విక్రయానికి ఉంచగా 9.66 కోట్ల షేర్లకోసం బిడ్స్‌ లభించాయి. అర్హతగల సంస్థాగత కొనుగోలుదారుల విభాగంలో 12.3 రెట్లు, సంపన్న వర్గాల కోటాలో దాదాపు 5 రెట్లు అధికంగా బిడ్స్‌ దాఖలయ్యాయి. రిటైల్‌ ఇన్వెస్టర్ల నుంచి మరింత అధికంగా 9.7 రెట్లు అధికంగా దరఖాస్తులు వచ్చాయి. కాగా.. డిజిన్వెస్ట్‌మెంట్‌కింద ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం రూ. 80,000 కోట్లను సమీకరించాలని లక్ష్యం పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ బాటలో ఇప్పటికే రైల్వే రంగ సంస్థ రైట్స్‌ ఇష్యూతోపాటు.. భారత్‌ 22 ఈటీఎఫ్‌లను పూర్తి చేసింది. తద్వారా రూ. 9,000 కోట్లు సమీకరించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో పబ్లిక్‌ ఇష్యూకి వచ్చిన 9వ కంపెనీ ఇర్కాన్‌కాగా.. ప్రభుత్వం డిజిన్వెస్ట్‌మెంట్ చేపపట్టిన రెండో కంపెనీ ఇది!  

Image result for IPO

ఇంజినీరింగ్ సంస్థ
ఇర్కాన్‌ ఇంటర్నేషనల్‌ కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఇంజినీరింగ్‌, నిర్మాణ రంగ సంస్థ. మౌలిక సదుపాయాల రంగంలో సమీకృత కార్యకలాపాలు చేపట్టగల కంపెనీ 1976లో ప్రారంభమైంది. రైల్వేలు, జాతీయ రహదారులు, బ్రిడ్జిలు, సొరంగ మార్గాలు, ఈహెచ్‌వీ సబ్‌స్టేషన్లు తదితర పలు ప్రధాన ప్రాజెక్టులను పూర్తిచేసింది. అంతేకాకుండా వాణిజ్య, రెసిడెన్షియల్ ఆస్తులను సైతం అభివృద్ధి చేసింది. 2018 మార్చికల్లా కంపెనీ ఆర్డర్‌ బుక్‌ విలువ రూ. 22,406 కోట్లుగా నమోదైంది. కంపెనీ ఆదాయంలో రైల్వే ప్రాజెక్టుల వాటా దాదాపు 69 శాతంకావడం ప్రస్తావించదగ్గ అంశం.  మౌలిక రంగంలో ఇకపైన కూడా రైల్వేలు, రహదారులు, ఫ్లేఓవర్లు తదితర పలు ప్రాజెక్టులకు అవకాశాలున్నట్లు కంపెనీ చైర్మన్‌ సునీల్‌ కుమార్‌ చౌదరి పేర్కొన్నారు. కంపెనీలో ఐపీవోకు ముందు ప్రభుత్వానికి 99.69 శాతం వాటా ఉంది. ఐపీవో ద్వారా 10 శాతం వాటాను విక్రయించింది.

ఆర్థిక పనితీరు 
కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన గత రెండేళ్లలో కంపెనీ ఆదాయం వార్షికంగా 27 శాతం వృద్ఢిని సాధించింది. నికర లాభం మాత్రం 2 శాతం స్థాయిలో పెరిగింది. సగటున నిర్వహణ లాభ(ఇబిటా) మార్జిన్లు దాదాపు 11 శాతం చొప్పున నమోదుకాగా.. 10.3 శాతం రిటర్న్‌ ఆన్‌ ఈక్విటీ(ఆర్‌వోఈ) సాధించింది. కంపెనీకి రుణభారంలేకపోగా.. 2018 మార్చికల్లా రూ. 4691 కోట్లమేర నగదు, తత్సమాన నిల్వలు కలిగి ఉంది.



Most Popular