ఎఫ్ఎంసీజీ దిగ్గజం హిందుస్తాన్ యూనిలీవర్(హెచ్‌యూఎల్) షేరుకి గతంలో ప్రకటించిన ఔట్పెర్ఫార్మ్ రేటింగ్‌ను కొనసాగించనున్నట్లు విదేశీ బ్రోకింగ్ సంస్థ సీఎల్ఎస్ఏ పేర్కొనడంతో ఇన్వెస్టర్లు ఈ కౌంటర్లో కొనుగోళ్లకు ఆసక్తి చూపుతున్నారు. మరోపక్క తాజాగా రూ. 221 కోట్ల విలువైన ఆర్డర్‌ను పొందినట్లు వెల్లడించడంతో ఇండియన్ హ్యూమ్ పైప్ కౌంటర్ సైతం లాభాలతో సందడి చేస్తోంది. వివరాలు చూద్దాం...
హెచ్‌యూఎల్
ఈ ఆర్థిక సంవత్సరం తొలి క్వార్టర్లో ప్రోత్సాహకర ఫలితాలు సాధించిన హెచ్‌యూఎల్ రెండో క్వార్టర్లోనూ ఇదే స్థాయి పనితీరును ప్రదర్శించే వీలున్నట్లు పేర్కొంది. ప్రొడక్టులకు డిమాండ్ కొనసాగుతున్నట్లు తెలియజేసింది. పట్టణ ప్రాంతాలను మించుతూ గ్రామీణ ప్రాంతాల నుంచి అధిక డిమాండ్ కనిపిస్తున్నట్లు హెచ్‌యూఎల్ యాజమాన్యం తాజాగా తెలియజేసింది. ఈ నేపథ్యంలో హెచ్‌యూఎల్ షేరుకి గతంలో ఇచ్చిన ఔట్‌ఫెర్ఫార్మ్ రేటింగ్‌ను కొనసాగిస్తున్నట్లు విదేశీ రీసెర్చ్ సంస్థ సీఎల్ఎస్ఏ పేర్కొంది. షేరుకి రూ. 1950 టార్గెట్ ధరను ప్రకటించింది. అయితే చమురు ధరల పెరుగుదల, రూపాయి పతనంవంటి అంశాలు హెచ్‌యూఎల్ మార్జిన్లను దెబ్బతీయవచ్చని అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో ఎన్ఎస్ఈలో ప్రస్తుతం హెచ్‌యూఎల్ షేరు దాదాపు 4 శాతం జంప్‌చేసి రూ. 1664 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 1669 వద్ద గరిష్టాన్నీ, రూ. 1618 వద్ద కనిష్టాన్నీ తాకింది.
ఇండియన్ హ్యూమ్ పైప్
మధ్యప్రదేశ్ జల నిగమ్ మర్యాదిత్ నుంచి దాదాపు రూ. 222 కోట్ల విలువైన ఆర్డర్ లభించినట్లు ఇండియన్ హ్యూమ్ పైప్ తాజాగా వెల్లడించింది. దీంతో ఈ కౌంటర్ ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఎన్ఎస్ఈలోఈ షేరు దాదాపు 2 శాతం పెరిగి రూ. 276 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 284 వద్ద గరిష్టాన్నీ, రూ. 267 వద్ద కనిష్టాన్నీ తాకింది. గ్రామీణ నీటిపారుదల సౌకర్యాల కోసం లభించిన ఆర్డర్లో భాగంగా ఇంజినీరింగ్, ప్రొక్యూర్మెంట్, టెస్టింగ్, మెయిన్టెనెన్స్ తదితర కార్యక్రమాలను చేపట్టవలసి ఉంటుందని ఇండియన్ హ్యూమ్ పేర్కొంది. ప్రాజెక్టును రెండేళ్లలోగా పూర్తిచేయవలసి ఉంటుందని తెలియజేసింది. బన్సాగర్ డ్యామ్ నుంచి 29 ఎంఎల్డీకిపైగా నీటిని శుద్ధిచేసి 18 గ్రామాలకుపైగా పంప్చేయవలసి ఉంటుందని వివరించింది.