గుడ్‌రిక్‌ గ్రూప్‌, గుజరాత్‌ ఆల్కలీస్‌.. జోష్‌

గుడ్‌రిక్‌ గ్రూప్‌, గుజరాత్‌ ఆల్కలీస్‌.. జోష్‌

మెక్‌లాయిడ్‌ రస్సెల్‌ ఇండియాకు చెందిన టీ ఎస్టేట్లు, బేరర్‌ ప్లాంట్ల కొనుగోలుకి ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు ప్రకటించడంతో గుడ్‌రిక్‌ గ్రూప్‌ కౌంటర్‌ జోరందుకోగా.. గుజరాత్‌లోని దహేజ్‌ ప్లాంటు వాణిజ్య ప్రాతిపదికన కార్యకలాపాలు ప్రారంభించినట్లు వెల్లడించడంతో గుజరాత్‌ ఆల్కలీస్‌ కౌంటర్‌ వెలుగులోకి వచ్చింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు దృష్టిపెట్టడంతో ఈ రెండు కౌంటర్లూ లాభాలతో కళకళలాడుతున్నాయి. వివరాలు చూద్దాం..

గుడ్‌రిక్‌ గ్రూప్‌
అస్సాంలోని హర్‌చూర టీ ఎస్టేట్‌కు సంబంధించిన కొన్ని ఆస్తుల కొనుగోలుకి మెక్‌లాయిడ్‌ రస్సెల్‌ ఇండియాతో అవగాహనా ఒప్పందాన్ని(ఎంవోయూ) కుదుర్చుకున్నట్లు గుడ్‌రిక్‌ గ్రూప్‌ పేర్కొంది. తద్వారా అస్సాంలో తేయాకు కార్యకలాపాలను మరింత విస్తరించనున్నట్లు తెలియజేసింది. ఇందుకు వీలుగా మెక్‌లాయిడ్‌ నుంచి ప్రత్యేకించిన బేరర్‌ ప్లాంట్లతోపాటు.. టీ ఎస్టేట్‌ను సొంతం చేసుకోనున్నట్లు వెల్లడించింది. ఇందుకు దాదాపు రూ. 32 కోట్లను వెచ్చిచంనున్నట్లు తెలియజేసింది. సాధ్యాసాధ్యాల నివేదికను పరిశీలించాక తగిన అనుమతులు పొందాక కొనుగోలు ప్రక్రియను పూర్తి చేయనున్నట్లు వివరించింది. ఈ వార్తల నేపథ్యంలో ఇన్వెస్టర్లు గుడ్‌రిక్‌ గ్రూప్‌ కౌంటర్లో కొనుగోళ్లకు ఎగబడుతున్నారు. ప్రస్తుతం బీఎస్ఈలోఈ  షేరు 4.3 శాతం జంప్‌చేసి రూ. 336 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 350 వరకూ దూసుకెళ్లింది. గుడ్‌రిక్‌ గ్రూప్‌లో ప్రమోటర్లకు 74 శాతం వాటా ఉంది.

Image result for gujarat alkalies & chemicals ltd

గుజరాత్‌ ఆల్కలీస్‌
గుజరాత్‌లోని దహేజ్‌లో ఏర్పాటు చేసిన హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌ ప్లాంటు.. వాణిజ్య ప్రాతిపదికన కార్యకలాపాలు ప్రారంభించినట్లు గుజరాత్‌ ఆల్కలీస్‌ తాజాగా పేర్కొంది. దీంతో ఇన్వెస్టర్లు ఈ కౌంటర్‌వైపు దృష్టిసారించారు. ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో గుజరాత్‌ ఆల్కలీస్‌ షేరు 5.4 శాతం జంప్‌చేసి రూ. 611 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 615 వరకూ ఎగసింది. కంపెనీలో ప్రమోటర్లకు 46.28 శాతం వాటా ఉంది. దహేజ్‌ ప్లాంటు కారణంగా రూ. 70 కోట్లమేర అదనపు  ఆదాయం సమకూరనున్నట్లు కంపెనీ తెలియజేసింది. ప్రస్తుతం దహేజ్‌లో మూడు, వడొదరలో ఒకటి చొప్పున ఏర్పాటైన ప్లాంట్ల ద్వారా మొత్తం 54,400 టన్నులమేర హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌ను వార్షికంగా తయారు చేయగల సామర్థ్యాన్ని అందుకున్నట్లు తెలియజేసింది. 



Most Popular