యాపిల్‌, ట్విటర్‌ డౌన్‌- మార్కెట్లు వీక్‌!

యాపిల్‌, ట్విటర్‌ డౌన్‌- మార్కెట్లు వీక్‌!

ప్రెసిడెంట్‌ ట్రంప్‌ చైనాకు చెందిన 200 బిలియన్‌ డాలర్ల విలువైన దిగుమతులపై సుంకాల విధింపునకు సిద్ధపడుతున్నారన్న వార్తల నేపథ్యంలో సోమవారం అమెరికా స్టాక్‌ మార్కెట్లు నష్టపోయాయి. కాగా.. మార్కెట్లు ముగిశాక 10 శాతం టారిఫ్‌లను విధించనున్నట్లు ట్రంప్‌ వెల్లడించడంతో మరోసారి స్టాక్‌ ఫ్యూచర్స్‌ అమ్మకాలతో నీరసించాయి. చైనాతో అమెరికా వాణిజ్య లోటు భారీగా పెరిగిందని.. దీనిని ఇకపై ఉపేక్షించబోమని ట్రంప్‌ వ్యాఖ్యానించడంతో నేడు కూడా మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యే వీలున్నట్లు నిపుణులు చెబుతున్నారు. సోమవారం ట్రేడింగ్‌ ముగిసేసరికి డోజోన్స్‌ 92 పాయింట్ల(0.35 శాతం) నష్టంతో 26,062 వద్ద నిలవగా.. ఎస్‌అండ్‌పీ 16 పాయింట్లు(0.56 శాతం) బలహీనపడి 2,889 వద్ద ముగిసింది. నాస్‌డాక్‌ మరింత అధికంగా 114 పాయింట్లు(1.43 శాతం) కోల్పోయి 7,896 వద్ద  స్థిరపడింది. కన్జూమర్‌, టెక్నాలజీ రంగాలు ప్రధానంగా అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నట్లు మార్కెట్‌ వర్గాలు తెలియజేశాయి. కాగా.. దిగుమతులపై అమెరికా టారిఫ్‌లు విధిస్తే రక్షణాత్మక విధానాలకు కట్టుబడబోమంటూ చైనా ఇప్పటికే స్పష్టం చేసింది. దీంతో చైనా సైతం టారిఫ్‌ల విధింపు బాట పట్టవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.

Image result for Apple inc and Twitter

యాపిల్‌ డౌన్‌
ఉత్తర అమెరికా తరువాత చైనాలోనే అత్యధికంగా ఐఫోన్లను విక్రయిస్తున్న టెక్నాలజీ దిగ్గజం యాపిల్‌ ఇంక్‌ షేరు దాదాపు 3 శాతం వెనకడుగు వేసింది. ఈ బాటలో నెట్‌ఫ్లిక్స్‌, ఫేస్‌బుక్‌, అల్ఫాబెట్‌ తదితర ఫాంగ్‌ స్టాక్స్‌ సైతం 1-4 శాతం మధ్య తిరోగమించాయి. ట్విటర్‌ 4.2 శాతం పతనమైంది. ఇక రిటైలింగ్‌ దిగ్గజాలు మ్యాకీస్‌ ఇంక్‌, కోల్స్‌ కార్ప్‌ 2 శాతంపైగా క్షీణించాయి. బ్రోకింగ్‌ సంస్థ మోఫెట్‌నాథన్‌సన్‌ పెరుగుతున్న వ్యయాలపై ఆందోళన వెలిబుచ్చడంతో ట్విటర్‌ కౌంటర్‌లో అమ్మకాలు ఊపందుకున్నట్లు నిపుణులు పేర్కొన్నారు.

 Most Popular