ఇర్కాన్‌ ఇంటర్నేషనల్‌ ఐపీవో షురూ!

ఇర్కాన్‌ ఇంటర్నేషనల్‌ ఐపీవో షురూ!

కేంద్ర ప్రభుత్వ సంస్థ ఇర్కాన్‌ ఇంటర్నేషనల్‌ పబ్లిక్‌ ఇష్యూ సోమవారం(17న) ప్రారంభం కానుంది. ఇంజినీరింగ్‌, కన్‌స్ట్రక్షన్‌ సంస్థ ఇర్కాన్‌ ఐపీవోకు ప్రైస్‌బ్యాండ్‌ రూ. 470-475 కాగా... ఇష్యూ బుధవారం(19న) ముగియనుంది. ఇష్యూలో భాగంగా ప్రభుత్వం 10 శాతం వాటాను విక్రయానికి ఉంచనుంది. తద్వారా రూ. 470 కోట్లు సమకూర్చుకోవాలని భావిస్తోంది. ఇందుకు వీలుగా ప్రభుత్వం 99 లక్షలకుపైగా షేర్లను అమ్మకానికి పెడుతోంది. కంపెనీ బీఎస్ఈ, ఎన్‌ఎస్‌ఈలలో లిస్ట్‌కానుంది. డిజిన్వెస్ట్‌మెంట్‌కింద ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం రూ. 80,000 కోట్లను సమీకరించాలని లక్ష్యం పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ బాటలో ఇప్పటికే రైల్వే రంగ సంస్థ రైట్స్‌ ఇష్యూతోపాటు.. భారత్‌ 22 ఈటీఎఫ్‌లను పూర్తి చేసింది. తద్వారా రూ. 9,000 కోట్లు సమకూర్చుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో పబ్లిక్‌ ఇష్యూకి వస్తున్న 9వ కంపెనీ ఇర్కాన్‌కాగా.. ప్రభుత్వం డిజిన్వెస్ట్‌మెంట్ చేపడుతున్న రెండో కంపెనీ ఇది! 

కనీసం 30 షేర్లకు దరఖాస్తు
ఐపీవోలో భాగంగా కంపెనీ 30 షేర్లను ఒక లాట్‌గా నిర్ణయించింది. దీంతో రిటైల్‌ ఇన్వెస్టర్లు కనీసం 30 షేర్లకు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఇంతకుమించి కావాలనుకుంటే రూ. 2 లక్షల విలువకు మించకుండా ఒకే లాట్‌లో దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. రిటైల్‌ ఇన్వెస్టర్లకు షేరుకి రూ. 10 డిస్కౌంట్‌ను ప్రభుత్వం ఆఫర్‌ చేస్తోంది. 

Image result for ircon international limited

ఇంజినీరింగ్ సంస్థ
ఇర్కాన్‌ ఇంటర్నేషనల్‌ కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఇంజినీరింగ్‌, నిర్మాణ రంగ సంస్థ. మౌలిక సదుపాయాల రంగంలో సమీకృత కార్యకలాపాలు చేపట్టగల కంపెనీ 1976లో ప్రారంభమైంది. రైల్వేలు, జాతీయ రహదారులు, బ్రిడ్జిలు, సొరంగ మార్గాలు, ఈహెచ్‌వీ సబ్‌స్టేషన్లు తదితర పలు ప్రధాన ప్రాజెక్టులను పూర్తిచేసింది. అంతేకాకుండా వాణిజ్య, రెసిడెన్షియల్ ఆస్తులను సైతం అభివృద్ధి చేసింది. 2018 మార్చికల్లా కంపెనీ ఆర్డర్‌ బుక్‌ విలువ రూ. 22,406 కోట్లుగా నమోదైంది. కంపెనీ ఆదాయంలో రైల్వే ప్రాజెక్టుల వాటా దాదాపు 69 శాతంకావడం ప్రస్తావించదగ్గ అంశం.  మౌలిక రంగంలో ఇకపైన కూడా రైల్వేలు, రహదారులు, ఫ్లేఓవర్లు తదితర పలు ప్రాజెక్టులకు అవకాశాలున్నట్లు కంపెనీ చైర్మన్‌ సునీల్‌ కుమార్‌ చౌదరి పేర్కొన్నారు. కంపెనీలో ప్రస్తుతం ప్రభుత్వానికి 99.69 శాతం వాటా ఉంది. ఐపీవో ద్వారా 10 శాతం వాటాను విక్రయించనుంది.

ఆరు ప్రాజెక్టుల పూర్తి
2015 ఏప్రిల్‌ నుంచి 2017 డిసెంబర్‌ కాలంలో ఆరు రైల్వే సంబంధ ప్రాజెక్టులను పూర్తిచేసినట్లు సునీల్‌ పేర్కొన్నారు. వీటిలో సొరంగ మార్గాలు, ట్రాక్‌ పనులు, బ్రిడ్జిలు, స్టేషన్‌ బిల్డింగులు, సిగ్నలింగ్, టెలికమ్యూనికేషన్‌ పనులున్నట్లు తెలియజేశారు. కంపెనీ అత్యధిక శాతం ప్రాజెక్టులను ఈపీసీ ప్రాతిపదికన ఫిక్స్‌డ్‌, టర్న్‌కీ పద్ధతిలో నిర్వహిస్తుంటుంది. క్లయింట్ల అవసరాలకు అనుగుణంగా బీవోటీ ప్రాజెక్టులను సైతం చేపడుతుంటుంది. శ్రీలంక, బంగ్లాదేశ్‌, మలేసియాసహా విదేశాలలో ఐదు కార్యాలయాలను ఏర్పాటు చేసింది.

ఆర్థిక పనితీరు 
కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన గత రెండేళ్లలో కంపెనీ ఆదాయం వార్షికంగా 27 శాతం వృద్ఢిని సాధించింది. నికర లాభం మాత్రం 2 శాతం స్థాయిలో పెరిగింది. సగటున నిర్వహణ లాభ(ఇబిటా) మార్జిన్లు దాదాపు 11 శాతం చొప్పున నమోదుకాగా.. 10.3 శాతం రిటర్న్‌ ఆన్‌ ఈక్విటీ(ఆర్‌వోఈ) సాధించింది. కంపెనీకి రుణభారంలేకపోగా.. 2018 మార్చికల్లా రూ. 4691 కోట్లమేర నగదు, తత్సమాన నిల్వలు కలిగి ఉంది.Most Popular