అశోక్‌ లేలాండ్, సకుమా ఎక్స్‌పోర్ట్స్‌ అప్‌

అశోక్‌ లేలాండ్, సకుమా ఎక్స్‌పోర్ట్స్‌ అప్‌

షేర్ల విభజనకు బోర్డు ఆమోదముద్ర వేసిన వార్తలతో సకుమా ఎక్స్‌పోర్ట్స్‌ కౌంటర్‌ ఇన్వెస్టర్ల కొనుగోళ్లతో కళకళలాడుతుంటే.. బంగ్లాదేశ్‌ నుంచి బస్సుల కొనుగోలుకి ఆర్డర్ లభించినట్లు వెల్లడించడంతో ఆటో దిగ్గజం అశోక్‌ లేలాండ్‌ కౌంటర్‌ ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. వివరాలు చూద్దాం..

అశొక్‌ లేలాండ్‌: ఇప్పటికే డబుల్‌ డెకర్ బస్సులకు ఆర్డర్‌ను పొందిన దేశీ ఆటో రంగ దిగ్గజం తాజాగా 200 సింగిల్ డెకర్‌ ఏసీ బస్సుల సరఫరాకు ఆర్డర్ లభించినట్లు వెల్లడించింది. బంగ్లాదేశ్‌ రోడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కార్పొరేషన్‌ నుంచి ఈ ఆర్డర్‌ దక్కినట్లు పేర్కొంది. దీంతో ఇన్వెస్టర్లు ఈ కౌంటర్‌వైపు దృష్టి సారించారు. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో అశోక్‌ లేలాండ్‌ షేరు 3.2 శాతం జంప్‌చేసి రూ. 132 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 133 వద్ద గరిష్టాన్నీ, రూ. 129 వద్ద కనిష్టాన్నీ తాకింది.

సకుమా ఎక్స్‌పోర్ట్స్‌: షేర్ల విభజనతోపాటు ఈక్విటీ జారీ ద్వారా నిధుల సమీకరణకు బోర్డు అనుమతించినట్లు వెల్లడించడంతో సకుమా ఎక్స్‌పోర్ట్స్‌ కౌంటర్‌ జోరందుకుంది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు దాదాపు 8 శాతం జంప్‌చేసి రూ. 218 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 221 వరకూ ఎగసింది. తాజా ప్రతిపాదనలో భాగంగా రూ. 10 ముఖ విలువగల ఒక్కో షేరునీ రూ. 1 ముఖ విలువగల 10 షేర్లుగా విడదీయనుంది. కాగా.. అర్హతగల సంస్థాగత ఇన్వెస్టర్లకు షేర్ల జారీ(క్విప్‌), లేదా విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్ట్‌మెంట్‌ లేదా ఇతర మార్గాల ద్వారా రూ. 800 కోట్ల సమీకరణకు సైతం బోర్డు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్లు కంపెనీ తెలియజేసింది.Most Popular