యూరప్‌, ఆసియా మార్కెట్లు ప్లస్‌లో!

యూరప్‌, ఆసియా మార్కెట్లు ప్లస్‌లో!

ప్రపంచస్థాయిలో వాణిజ్య యుద్ధ మేఘాలకు కారణమైన అమెరికా, చైనా మధ్య వివాద పరిష్కారానికి చర్చలు మొదలుకానున్న వార్తలతో యూరోపియన్‌ స్టాక్‌ మార్కెట్లు సానుకూలంగా ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం ఫ్రాన్స్‌ ఇండెక్స్‌ సీఏసీ 0.4 శాతం, జర్మన్‌ ఇండెక్స్‌ డాక్స్‌ 0.35 శాతం చొప్పున పుంజుకోగా.. యూకే ఇండెక్స్‌ ఎఫ్‌టీఎస్‌ఈ స్వల్ప లాభం(0.15 శాతం)తో కదులుతోంది. మరోపక్క కరెన్సీ పతనాన్ని అడ్డుకునే బాటలో టర్కీ కేంద్ర బ్యాంకు వడ్డీ రేటును తాజాగా 6.25 శాతంమేర పెంచింది. దీంతో టర్కీలో వడ్డీ రేటు 24 శాతానికి ఎగసింది. రెండు వారాల క్రితం అర్జెంటీనా సైతం ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొనే బాటలో వడ్డీ రేటును 60 శాతానికి చేర్చిన సంగతి తెలిసిందే. తద్వారా ప్రపంచంలోనే అత్యధిక వడ్డీ రేటును అమలు చేస్తున్న దేశంగా అర్జెంటీనా నిలుస్తోంది. కాగా.. ఆసియాలో చైనా మినహా మిగిలిన అన్ని మార్కెట్లూ లాభపడ్డాయి. కొరియా, తైవాన్‌, ఇండొనేసియా, జపాన్‌, హాంకాంగ్‌, సింగపూర్‌  1.4-1 శాతం  మధ్య ఎగశాయి. థాయ్‌లాండ్‌ 0.4 శాతం బలపడగా.. చైనా 0.2 శాతం నీరసించింది.
ఇన్వెస్టెక్‌ జోరు
అసెట్‌ మేనేజ్‌మెంట్‌ యూనిట్‌ను ప్రత్యేక కంపెనీగా విడదీయనున్నట్లు ప్రకటించడంతో బ్రిటిష్‌ సంస్థ ఇన్వెస్టెక్‌ 12 శాతం జంప్‌చేసింది. యూబీఎస్‌ షేరు రేటింగ్‌ను డౌన్‌గ్రేడ్‌ చేయడంతో అమెరికా, యూరప్‌లలో రిటైల్‌ స్టోర్లను నిర్వహిస్తున్న డచ్‌ సంస్థ ఎహోల్డ్‌ డెలైజ్‌ 2 శాతం క్షీణంచింది.Most Popular