ఇంజినీర్స్‌ ఇండియా అప్‌- క్వాలిటీ డౌన్‌

ఇంజినీర్స్‌ ఇండియా అప్‌- క్వాలిటీ డౌన్‌

పీడీఐఎల్‌ కంపెనీలో వాటా కొనుగోలు వార్తలతో పీఎస్‌యూ దిగ్గజం ఇంజినీర్స్‌ ఇండియా కౌంటర్‌ వెలుగులోకిరాగా.. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాల కారణంగా డైరీ ఉత్పత్తుల సంస్థ క్వాలిటీ లిమిటెడ్‌ కౌంటర్‌లో అమ్మకాలు తలెత్తాయి. వివరాలు చూద్దాం..

ఇంజినీర్స్‌ ఇండియా
ప్రాజెక్ట్స్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఇండియా(పీడీఐఎల్‌)లో ప్రభుత్వానికున్న 100 శాతం వాటాను కొనుగోలు చేసేందుకు బోర్డు ఆమోదించినట్లు వెల్లడించడంతో మౌలిక రంగ పీఎస్‌యూ సంస్థ ఇంజినీర్స్‌ ఇండియా కౌంటర్‌ జోరందుకుంది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో ఈ షేరు 3.2 శాతం పెరిగి రూ. 129 వద్ద ట్రేడవుతోంది. పీడీఐఎల్‌లో పూర్తి వాటా కొనుగోలుకి ఎరువులు, రసాయన శాఖ నుంచి గ్రీన్‌సిగ్నల్‌ లభించినట్లు ఇంజినీర్స్‌ ఇండియా పేర్కొంది.

క్వాలిటీ లిమిటెడ్‌
ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్‌-జూన్‌)లో క్వాలిటీ లిమిటెడ్‌ నికర లాభం రూ. 28 కోట్ల నుంచి పతనమై రూ.1 కోటికి పరిమితమైంది. మొత్తం ఆదాయం సైతం 19 శాతం క్షీణించి రూ. 1262 కోట్లకు చేరింది. దీంతో ఇన్వెస్టర్లు ఈ కౌంటర్లో అమ్మకాలకు దిగారు. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు దాదాపు 2 శాతం క్షీణించి రూ. 21 వద్ద ట్రేడవుతోంది.Most Popular