షుగర్‌ షేర్లకు ఇథనాల్‌ కిక్‌- ఆకాశమే హద్దు!

షుగర్‌ షేర్లకు ఇథనాల్‌ కిక్‌- ఆకాశమే హద్దు!

ఇథనాల్‌ ధరలను 25 శాతం వరకూ పెంచుతూ కేంద్ర కేబినెట్‌ నిర్ణయం తీసుకోవడంతో వరుసగా రెండో రోజు షుగర్‌ షేర్లు వెలుగులోకి వచ్చాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు క్యూకట్టడంతో పలు కౌంటర్లు ఏకంగా 20 శాతం అప్పర్‌ సర్క్యూట్లను తాకడం విశేషం. దాదాపు షుగర్‌ పేరున్న కంపెనీల కౌంటర్లన్నీ భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. ధంపూర్, అవధ్‌, మగధ్‌, కేఎం, ఉత్తమ్‌, రాజ్‌శ్రీ తదితర కౌంటర్లు 20-15 శాతం మధ్య దూసుకెళ్లాయి. ప్రస్తుతం లీటర్‌ ఇథనాల్‌ రూ. 24 స్థాయిలో ఉంది. రెండు కేజీల చెరకునుంచి ఒక లీటర్‌ ఇథనాల్‌ను ఉత్పత్తి చేయవచ్చని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. కాగా.. ఇథనాల్‌ ధరలను 25 శాతంమేర పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పరిశ్రమకు మేలు చేయనున్నట్లు షుగర్‌ మిల్స్‌ అసోసియేషన్‌(ఇస్మా) ఇప్పటికే పేర్కొంది. దీంతో పలు కంపెనీలు షుగర్‌ బిజినెస్‌ను ఇథనాల్‌ తయారీకి మళ్లించే వీలుంటుందని అభిప్రాయపడింది కూడా. రానున్న కాలంలో పెట్రోల్‌లో ఇథనాల్‌ను 10 శాతంవరకూ మిక్స్‌చేసే వీలున్నట్లు తెలియజేసింది. షుగర్‌ బిజినెస్‌ నుంచి ఇథనాల్‌కు మళ్లితే కంపెనీలకు వాటిల్లే నష్టాలకు పరిహారం లభించాల్సి ఉంటుందని మరోపక్క ఇస్మా వ్యాఖ్యానించింది.  

రేసు గుర్రాల్లా.
ప్రస్తుతం బీఎస్‌ఈలో పలు షుగర్‌ షేర్లు 20 శాతం చొప్పున అప్పర్‌ సర్క్యూట్‌లను తాకాయి. 20 శాతం ఎగసిన కంపెనీ జాబితాలో అవధ్‌ షుగర్స్‌ రూ. 473 వద్ద, మగధ్‌ షుగర్స్‌ రూ.107 సమీపంలో ఫ్రీజయ్యాయి. ఈ బాటలో ఉత్తమ్‌ షుగర్స్‌ 20 శాతం జంప్‌చేసి రూ. 109.4 వద్ద ఫ్రీజ్‌కాగా..  కేఎం షుగర్స్‌(20 శాతం) రూ. 11.36 వద్ద, రాజ్‌శ్రీ (20 శాతం) రూ. 28 వద్ద, శక్తి షుగర్స్‌(20 శాతం) రూ. 17.86 వద్ద, దాల్మియా భారత్‌(20 శాతం) రూ. 78 వద్ద, ఉగర్‌ షుగర్‌(20 శాతం) రూ. 16.36 వద్ద ఫ్రీజయ్యాయి. ఈ కౌంటర్లలో కొనుగోలుదారులే తప్ప అమ్మేవాళ్లు కరవుకావడం విశేషం!
దూకుడు
ఇతర కౌంటర్లలో ప్రస్తుతం బీఎస్ఈలో ధంపూర్‌ షుగర్స్‌ 19 శాతం దూసుకెళ్లి రూ. 116కు చేరగా.. మవానా 16 శాతం జంప్‌చేసి రూ. 59ను తాకింది. ఇక ద్వారికేష్‌ షుగర్స్‌ 16.5 శాతం ఎగసి రూ. 24 వద్ద, శ్రీ రేణుకా షుగర్స్‌ 14 శాతం పెరిగి రూ. 14.60 వద్ద ట్రేడవుతున్నాయి. ఈ బాటలో బజాజ్‌ హిందుస్తాన్‌ 17 శాతం ఎగసి రూ. 8.4 వద్ద, ఆంధ్రా షుగర్‌ 12 శాతం పెరిగి రూ. 419 వద్ద, త్రివేణీ ఇంజినీరింగ్‌ 12 శాతం లాభంతో రూ. 47.5 వద్ద, ప్రాజ్‌ ఇండస్ట్రీస్‌ 7.3 శాతం బలపడి రూ. 104.5 వద్ద ట్రేడవుతున్నాయి. ఇదే విధంగా బలరామ్‌పూర్‌ చినీ 9 శాతం ఎగసి రూ. 85కు చేరగా, బన్నారీ అమ్మన్‌ 13.4 శాతం జంప్‌చేసి రూ. 1705 వద్ద ట్రేడవుతోంది. ఇక గాయత్రి షుగర్స్‌ 5 శాతం జంప్‌చేసి రూ. 3.30 వద్ద నిలవగా.. ఈఐడీ ప్యారీ 5.5 శాతం ఎగసి రూ. 226 వద్ద కదులుతోంది. Most Popular