ఆసియా మార్కెట్లకు వాణిజ్య పుష్‌

ఆసియా మార్కెట్లకు వాణిజ్య పుష్‌

దిగుమతి సుంకాల విధింపు అంశంలో ఏర్పడ్డ వివాద పరిష్కారాలకు అమెరికా ప్రభుత్వం  చైనాను చర్చలకు ఆహ్వానించినట్లు వెలువడ్డ వార్తల నేపథ్యంలో ఆసియా స్టాక్ మార్కెట్లు సానుకూలంగా ప్రారంభమయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా బలపడ్డ సెంటిమెంటుకుతోడు టెక్నాలజీ, ఇండస్ట్రియల్‌ దిగ్గజాలు బలపడటంతో గురువారం అమెరికా స్టాక్‌ మార్కెట్లు సైతం లాభపడ్డాయి. ఈ బాటలో ప్రస్తుతం ఆసియాలోనూ చైనామినహా అన్ని మార్కెట్లూ పాజిటివ్‌గా కదులుతున్నాయి. కాగా.. టర్కీ, అర్జెంటీనా ఆర్థిక సంక్షోభాలు, చైనా, అమెరికా వాణిజ్య వివాదాల నేపథ్యంలో రిస్కులు పెరుగుతున్నాయని పేర్కొంటూ యూరోపియన్‌ కేంద్ర బ్యాంకు(ఈసీబీ) గురువారం యథాతథ పాలసీ అమలుకే కట్టుబడుతున్నట్లు ప్రకటించింది. ఇక మరోపక్క టర్కీ కేంద్ర బ్యాంకు తమ కరెన్సీ లైరాకు మద్దతిచ్చే బాటలో వడ్డీ రేట్లను 6.25 శాతంమేర పెంచడం ద్వారా 24 శాతానికి చేర్చింది. దీంతో డాలరుతో మారకంలో 6కు బలపడిన లైరా ప్రస్తుతం 6.13కు బలహీనపడింది. యూరో 1.168 వద్ద స్థిరంగా కదులుతుంటే.. యూఎస్‌ ట్రెజరీ ఈల్డ్స్‌ 2.97 శాతానికి ఎగశాయి.
లాభాలతో
టెక్నాలజీ, ఇండస్ట్రియల్‌ దిగ్గజాల అండతో గురువారం డోజోన్స్‌ సరికొత్త గరిష్టానికి చేరువలో ముగిసింది. కాగా.. ప్రస్తుతం ఆసియాలో చైనా మినహా మిగిలిన మార్కెట్లు లాభాలతో ట్రేడవుతున్నాయి. కొరియా 1.3 శాతం జంప్‌చేయగా.. జపాన్‌, తైవాన్‌, సింగపూర్‌, హాంకాంగ్‌, ఇండొనేసియా 1-0.4 శాతం మధ్య ఎగశాయి. అయితే చైనా స్వల్పంగా 0.15 శాతం బలహీనపడగా.. థాయ్‌లాండ్‌ సెలవులో ఉంది.
 Most Popular