ఆర్‌సీఎఫ్‌-ఎన్‌బీసీసీ ఇండియా హైజంప్‌

ఆర్‌సీఎఫ్‌-ఎన్‌బీసీసీ ఇండియా హైజంప్‌

భూమి అభివృద్ధి హక్కుల బదిలీ(టీడీఆర్‌) విక్రయ వార్తలతో రాష్ట్రీయ కెమికల్స్‌ అండ్‌ ఫెర్టిలైజర్స్‌(ఆర్‌సీఎఫ్‌) కౌంటర్‌ ఇన్వెస్టర్ల కొనుగోళ్లతో కళకళలాడుతుంటే.. హెచ్‌ఎస్‌సీసీలో వాటా కొనుగోలు వార్తలతో జోరందుకుంది. వివరాలు చూద్దాం..

ఆర్‌సీఎఫ్‌
ముంబై మెట్రోపాలిటన్‌ ప్రాంతీయ అభివృద్ధి అధీకృత సంస్థ(ఎంఎంఆర్‌డీఏ), బీఎంసీల నుంచి పొందిన టీడీఆర్‌ను విక్రయించేందుకు కేంద్ర కేబినెట్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు వార్తలు వెలువడటంతో ఆర్‌సీఎఫ్‌ కౌంటర్‌కు భారీ డిమాండ్‌ ఏర్పడింది. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 9.5 శాతం దూసుకెళ్లి రూ. 74.5 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 79.60 వద్ద గరిష్టాన్నీ, రూ. 74 వద్ద కనిష్టాన్నీ తాకింది. అభివృద్ధి హక్కుల బదిలీ(టీడీఆర్‌) విక్రయానికి ఆర్‌సీఎఫ్‌ను ప్రభుత్వం అనుమతించినట్లు తెలుస్తోంది. కాగా.. ముంబై తూర్పుప్రాంతంలోగల 5.26 లక్షల చదరపు అడుగుల భూమిని ఈస్టర్న్‌ ఫ్రీవే నిర్మాణానికి వీలుగా 2010లో ఎంఎంఆర్‌డీఏకు ఆర్‌సీఎఫ్‌ బదిలీ చేసింది. 8ఏళ్ల తరువాత దీనికి రెట్టింపుగా 10.52 లక్షల చదరపు అడుగుల భూమి లేదా ఇందుకు సమానమైన అభివృద్ధి హక్కుల బదిలీ ఆర్‌సీఎఫ్‌కు లభించనున్నట్లు తెలుస్తోంది.

ఎన్‌బీసీసీ
హెచ్‌ఎస్‌సీసీలో వ్యూహాత్మకంగా చేపట్టనున్న 100 శాతం వాటా విక్రయానికి ఎన్‌బీసీసీ ఇండియా ఎంపికైనట్లు ఆర్థిక శాఖ తాజాగా పేర్కొన్నట్లు వెలువడ్డ వార్తల కారణంగా ఈ కౌంటర్‌ వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 3.2 శాతం జంప్‌చేసి రూ. 69 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 70 వద్ద గరిష్టాన్నీ, రూ. 68 వద్ద కనిష్టాన్నీ తాకింది. హెచ్‌ఎస్‌సీసీలో 100 శాతం వాటా బిడ్‌ విలువ రూ. 285 కోట్లుగా ప్రభుత్వం తెలియజేసింది.Most Popular