భళా.. రెండో రోజు రూపాయి జోరు!

భళా.. రెండో రోజు రూపాయి జోరు!

వరుసగా రెండో రోజు డాలరుతో మారకంలో దేశీ కరెన్సీ బౌన్స్‌బ్యాక్‌ అయ్యింది. ఇంటర్‌బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్లో ప్రారంభంలోనే 45 పైసలు(0.62 శాతం) జంప్‌చేసింది. 71.74 వద్ద ట్రేడింగ్‌ ప్రారంభమైంది. కాగా.. బుధవారం తొలుత చరిత్రాత్మక కనిష్టం 72.91 వరకూ పతనమైన రూపాయి తదుపరి ఆ స్థాయి నుంచి 90 పైసలమేర కోలుకున్న సంగతి తెలిసిందే. చివరికి మంగళవారం ముగింపు 72.69తో పోలిస్తే బుధవారం 50 పైసలు బలపడి 72.19 వద్ద స్థిరపడింది. గురువారం వినాయక చవితి పండుగ సందర్భంగా ఫారెక్స్‌ మార్కెట్లకు సెలవుకాగా.. ప్రస్తుతం 46 పైసలు ఎగసి 71.72 వద్ద ట్రేడవుతోంది.

ఆర్‌బీఐ డాలర్ల విక్రయం
వరుసగా నాలుగో నెలలోనూ ఆర్‌బీఐ నికరంగా డాలర్లను విక్రయించింది. జులైలో స్పాట్‌ మార్కెట్లో 187 కోట్ల విలువైన డాలర్లను విక్రయించింది. ఇదే విధంగా జూన్‌లో 6.184 బిలియన్‌ డాలర్లు, మేలో 5.767 బిలియన్‌ డాలర్లు, ఏప్రిల్‌లో 2.483 బిలియన్‌ డాలర్లను విక్రయించినట్లు ఆర్‌బీఐ  డేటా వెల్లడించింది. 

విదేశీ కారణాలు
ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు బలపడుతుంటే వర్థమాన దేశాల కరెన్సీలు పతనబాటలో సాగుతున్నాయి. మార్చి మొదలు ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు 8 శాతం ర్యాలీ చేసింది. ఓవైపు అర్జెంటీనా, టర్కీల ఆర్థిక సంక్షోభాలు కొనసాగుతుండగా.. మరోపక్క కరెన్సీ రుపయ్యా పతనాన్ని అడ్డుకునేందుకు ఇండొనేసియా కేంద్ర బ్యాంకు సైతం పలుమార్లు చర్యలు తీసుకుంది. ఈ నేపథ్యంలో డాలరుతో మారకంలో పలు వర్థమాన దేశాల కరెన్సీలు పతనమవుతూ వస్తున్న సంగతి తెలిసిందే. దీంతో రూపాయిపై సైతం ప్రతికూల ప్రభావం పడుతున్నట్లు ఫారెక్స్‌ వర్గాలు పేర్కొన్నాయి.  

దేశీయంగానూ
ఇటీవల తిరిగి జోరందుకున్న ముడిచమురు ధరలు రూపాయి మారకపు విలువపై ఒత్తిడిని పెంచుతున్నాయి. దేశీ అవసరాలకు 75 శాతం చమురును దిగుమతి చేసుకోవలసి ఉండటంతో దిగుమతుల బిల్లు పెరగనుంది. ఇందుకు సంకేతంగా జులైలో వాణిజ్య లోటు నాలుగేళ్ల గరిష్టానికి చేరిన విషయాన్ని ఆర్థికవేత్తలు ప్రస్తావిస్తున్నారు. మరోవైపు అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడరల్‌ రిజర్వ్‌ క్రమంగా వడ్డీ రేట్ల పెంపును చేపట్టనున్నట్లు సంకేతాలిచ్చింది. దీంతో డాలరు బలపడుతుంటే.. ఆసియా కరెన్సీలు బలహీనపడుతున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు.Most Popular