రికార్డుకు చేరువలో డోజోన్స్‌!

రికార్డుకు చేరువలో డోజోన్స్‌!

యాపిల్‌ తదితర టెక్నాలజీ దిగ్గజాలు ఊపందుకోవడంతో గురువారం అమెరికా స్టాక్‌ మార్కెట్లు లాభపడ్డాయి. డోజోన్స్‌ 147 పాయింట్లు(0.57 శాతం) ఎగసి 26,146 వద్ద నిలవగా.. ఎస్‌అండ్‌పీ 15 పాయింట్లు(0.53 శాతం) పుంజుకుని 2,904 వద్ద ముగిసింది. నాస్‌డాక్‌ సైతం 59 పాయింట్లు(0.75 శాతం) లాభపడి 8,014 వద్ద  స్థిరపడింది. దీంతో డోజోన్స్‌ ఈ ఏడాది జనవరి 26న సాధించిన చరిత్రాత్మక గరిష్టం రికార్డుకు చేరువలో నిలిచింది. ఎస్‌అండ్‌పీ, నాస్‌డాక్‌ ఇప్పటికే సరికొత్త గరిష్టాలను అందుకున్నాయి. కాగా.. వాణిజ్య వివాదాల పరిష్కారం కోసం అమెరికా, చైనా మధ్య చర్చలకు తెరలేవనుండటంతో ఇన్వెస్టర్లకు జోష్‌నిచ్చినట్లు నిపుణులు పేర్కొన్నారు. బుధవారం ట్రంప్‌ ప్రభుత్వం వాణిజ్య విభేదాలపై చర్చించేందుకు చైనాను ఆహ్వానించినట్లు వార్తలు వెలువడ్డాయి. 

యాపిల్‌, క్వాల్‌కామ్‌ జోరు
భారీ తెరలతో కూడిన సరికొత్త మోడళ్లలో ఐఫోన్లను విడుదల చేయడంతో టెక్‌ దిగ్గజం యాపిల్‌ ఇంక్‌ 3 శాతం ఎగసింది. 16 బిలియన్‌ డాలర్లతో ఈక్విటీ షేర్ల బైబ్యాక్‌ ప్రకటించడంతో క్వాల్‌కామ్‌ 4 శాతం జంప్‌చేసింది. అయితే అమ్మకాలు నిరాశపరచడంతో రిటైల్‌ దిగ్గజం క్రోగర్ 10 శాతం పతనమైంది. మరోవైపు అమెరికా, చైనా మధ్య వాణిజ్య చర్చల వార్తలతో బ్లూచిప్స్‌లో కేటర్‌ పిల్లర్‌ 1 శాతం, బోయింగ్‌ 0.6 శాతం చొప్పున బలపడ్డాయి. ఇతర కౌంటర్లలో హోమ్‌ డిపో 1.2 శాతం, లోవ్స్‌ కో 1.3 శాతం చొప్పున బలహీనపడ్డాయి. ఉత్తర కరోలినాను ఫ్లోరెన్స్‌ తుఫాన్‌ ముంచెత్తనున్న నేపథ్యంలో బీకన్‌ రూఫింగ్‌ సప్లే 6 శాతం పతనమైంది. 

 Most Popular