లాభాల ఓపెనింగ్‌ చాన్స్‌?

లాభాల ఓపెనింగ్‌ చాన్స్‌?

దేశీ స్టాక్‌ మార్కెట్లు నేడు లాభాలతో ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ప్రస్తుతం సింగపూర్(ఎస్‌జీఎక్స్) నిఫ్టీ 47 పాయింట్లు పెరిగి 11,492 వద్ద ట్రేడవుతోంది. సాధారణంగా దేశీ మార్కెట్ల ట్రెండ్‌ను ఎస్‌జీఎక్స్ నిఫ్టీ ప్రతిఫలిస్తూ ఉంటుంది. అమెరికా, చైనా మధ్య వాణిజ్య వివాద పరిష్కారం దిశగా చర్చలు ప్రారంభంకానున్న వార్తలతో ప్రపంచవ్యాప్తంగా సెంటిమెంటు బలపడింది. మరోవైపు టెక్నాలజీ దిగ్గజాలు అండగా నిలవడంతో గురువారం అమెరికా స్టాక్‌ మార్కెట్లు లాభపడ్డాయి.  గురువారం గణేశ్‌ చతుర్ధి పర్వదినం సందర్భంగా దేశీ స్టాక్ మార్కెట్లకు సెలవుకాగా.. బుధవారం అటు రూపాయి.. ఇటు స్టాక్స్‌ బౌన్స్‌బ్యాక్‌ అయిన విషయం విదితమే. చివరి సెషన్‌లో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ప్రాధాన్యం ఇవ్వడంతో రూపాయి కనిష్టం నుంచి 90 పైసలు కోలుకోగా.. మార్కెట్లు లాభాల హైజంప్‌ చేశాయి. ట్రేడింగ్‌ ముగిసేసరికి సెన్సెక్స్‌ 305 పాయింట్లు ఎగసి 37,718 వద్ద నిలవగా.. నిఫ్టీ 82 పాయింట్లు పెరిగి 11,370 వద్ద స్థిరపడింది. 

నిఫ్టీ కదలికలు ఇలా..! 
నేడు నిఫ్టీ బలహీనపడితే తొలుత 11,286 పాయింట్ల వద్ద, తదుపరి 11,203 స్థాయిలోనూ మద్దతు లభించే వీలున్నదని సాంకేతిక నిపుణులు అంచనా వేశారు. ఒకవేళ ఊపందుకుంటే.. తొలుత 11,417 పాయింట్ల వద్ద, తదుపరి 11,464 స్థాయిలోనూ రెసిస్టెన్స్‌ ఎదురుకావచ్చని భావిస్తున్నారు. బ్యాంక్‌ నిఫ్టీకి 26618, 26416 పాయింట్ల వద్ద మద్దతు.. 26958, 27096 వద్ద రెసిస్టెన్స్‌ కనిపించే వీలున్నట్లు పేర్కొన్నారు.

ఎఫ్‌పీఐల భారీ అమ్మకాలు 
నగదు విభాగంలో బుధవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 1086 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించగా... దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 541 కోట్లకుపైగా ఇన్వెస్ట్‌ చేశాయి. కాగా.. సోమవారం దాదాపు రూ. 842 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించిన ఎఫ్‌పీఐలు మంగళవారం మరింత అధికంగా రూ. 1454 కోట్లకుపైగా పెట్టుబడులను వెనక్కి తీసుకోగా...  సోమవారం రూ. 290 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించిన దేశీ ఫండ్స్‌ మంగళవారం దాదాపు రూ. 750 కోట్లను ఇన్వెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే.

 Most Popular