సెకండాఫ్‌ భళా- రుపీ, స్టాక్స్‌ రయ్‌రయ్‌!

సెకండాఫ్‌ భళా- రుపీ, స్టాక్స్‌ రయ్‌రయ్‌!

ఈ వారాంతాన ఆర్థిక సమీక్షను చేపట్టనున్నట్లు ప్రధాని మోడీ ప్రకటించిన నేపథ్యంలో మిడ్‌సెషన్‌ నుంచీ కొనుగోళ్లు జోరందుకున్నాయి. దీంతో ఓవైపు రూపాయి, మరోపక్క స్టాక్‌ మార్కెట్లు బౌన్స్‌బ్యాక్‌ అయ్యాయి. వరుసగా మూడో రోజు రూపాయి సరికొత్త కనిష్టాన్ని తాకగా.. సెన్సెక్స్‌ సైతం తొలుత ఆటుపోట్లకు లోనైంది. అయితే చివరి సెషన్‌లో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ప్రాధాన్యం ఇవ్వడంతో రూపాయి కనిష్టం నుంచి 90 పైసలు కోలుకోగా.. మార్కెట్లు లాభాల హైజంప్‌ చేశాయి. ట్రేడింగ్‌ ముగిసేసరికి సెన్సెక్స్‌ 305 పాయింట్లు ఎగసి 37,718 వద్ద నిలవగా.. నిఫ్టీ 82 పాయింట్లు పెరిగి 11,370 వద్ద స్థిరపడింది. 
ఎఫ్‌ఎంసీజీ దూకుడు
ఎన్‌ఎస్‌ఈలో ప్రధానంగా ఎఫ్‌ఎంసీజీ 2.5 శాతం జంప్‌చేయగా.. మెటల్‌ 1.5 శాతం, ఫార్మా 1 శాతం చొప్పున బలపడ్డాయి. రియల్టీ 0.6 శాతం నీరసించింది. నిఫ్టీ దిగ్గజాలలో పవర్‌గ్రిడ్‌, సన్‌ ఫార్మా, అదానీ పోర్ట్స్‌, ఐటీసీ, హిందాల్కో, యూపీఎల్‌, ఐషర్‌, లుపిన్‌, టాటా స్టీల్‌, హెచ్‌యూఎల్‌ 3.5-2 శాతం మధ్య జంప్‌చేశాయి. అయితే యాక్సిస్‌, టాటా మోటార్స్‌, హెచ్‌పీసీఎల్‌, ఐసీఐసీఐ, ఐవోసీ, ఏషియన్‌ పెయింట్స్‌, కోల్‌ ఇండియా, టెక్‌ మహీంద్రా, యస్‌బ్యాంక్‌, బీపీసీఎల్‌ 2-1 శాతం మధ్య క్షీణించాయి.
చిన్న షేర్లు అటూఇటూ
చిన్న షేర్లలో మిశ్రమ ట్రెండ్‌ నెలకొంది. బీఎస్ఈలో మిడ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.5 శాతం పుంజుకోగా.. స్మాల్‌ క్యాప్‌ 0.3 శాతం బలహీనపడింది. ట్రేడైన మొత్తం షేర్లలో 1526 నష్టపోగా.. 1130 లాభాలతో ముగిశాయి.
ఎఫ్‌పీఐల భారీ అమ్మకాలు 
నగదు విభాగంలో సోమవారం దాదాపు రూ. 842 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించిన విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) మంగళవారం మరింత అధికంగా రూ. 1454 కోట్లకుపైగా పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. మరోవైపు సోమవారం రూ. 290 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించిన దేశీ ఫండ్స్‌(డీఐఐలు) మంగళవారం దాదాపు రూ. 750 కోట్లను ఇన్వెస్ట్‌ చేశాయి. Most Popular