52 వారాల కనిష్టానికి 37 స్టాక్స్‌!

52 వారాల కనిష్టానికి 37 స్టాక్స్‌!

ప్రస్తుతం మార్కెట్లు జోరందుకున్నప్పటికీ తొలుత ఆటుపోట్లకు లోనైన నేపథ్యంలో పలు మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. దీంతో బీఎస్ఈ-500 ఇండెక్స్‌కు ప్రాతినిధ్యం వహించే 37 షేర్లు 52 వారాల కనిష్టాలకు చేరాయి. జాబితాలో అపోలో టైర్స్‌, జీఐసీ హౌసింగ్‌, సన్‌ టీవీ నెట్‌వర్క్‌, వొడాఫోన్‌ ఐడియా, బీఈఎంఎల్‌, భారత్‌ ఎలక్ట్రానిక్స్‌, భారతీ ఇన్‌ఫ్రాటెల్‌, ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ తదితరాలున్నాయి.  
చమురు ఎఫెక్ట్‌
విదేశీ మార్కెట్లో ముడిచమురు ధరలు మండుతున్న కారణంగా పెట్రో మార్కెటింగ్‌ కంపెనీలు ఐవోసీ, బీపీసీఎల్‌, హెచ్‌పీసీఎల్‌, ఎంఆర్‌పీఎల్‌ ఏడాది కనిష్టాలను తాకాయి. చమురు ధరల ప్రభావంతో ఏవియేషన్‌ స్టాక్స్‌ జెట్‌ ఎయిర్‌వేస్‌, ఇంటర్‌గ్లోబ్‌ సైతం 52 వారాల కనిష్టాలకు చేరాయి. ఈ బాటలో రియల్టీ షేర్లు ఇండియాబుల్స్‌, ప్రెస్టేజ్‌ ఎస్టేట్స్‌తోపాటు నవకార్‌ కార్ప్‌, శంకర బిల్డింగ్‌ ప్రొడక్ట్స్‌ సైతం జాబితాలో చేరాయి.
50 శాతం ఆవిరి
జాబితాలోని ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌, బీఈఎంఎల్‌, జేపీ అసోసియేట్స్‌, జెట్‌ ఎయిర్‌వేస్‌, భారత్‌ ఎలక్ట్రానిక్స్‌, హెచ్‌పీసీఎల్‌ కౌంటర్లు గత ఏడాదికాలంలో 50 శాతంపైగా పతనంకావడం గమనించదగ్గ విషయం! గత రెండు రోజుల్లో 13 శాతం పతనమైన ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ ట్రాన్స్‌ షేరు మరో 5 శాతం దిగజారింది. ఈ మౌలిక సదుపాయాల సంస్థ రుణాలు, డిబెంచర్లను రేటింగ్‌ ఏజెన్సీ ఇక్రా డౌన్‌గ్రేడ్‌ చేయడమే దీనికి కారణంకాగా.. రుణ చెల్లింపులు పెరిగిపోవడంతో ఐఎల్‌అండ్ఎఫ్‌ఎస్‌ గ్రూప్‌ లిక్విడిటీ ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. కాగా.. ఆగస్ట్‌ నుంచీ 23 శాతం నీరసించిన అపోలో టైర్స్‌ తాజాగా రూ. 226 వద్ద కనిష్టాన్ని తాకింది. రూ. 5,500 కోట్లతో రానున్న రెండేళ్లలో విస్తరణ కార్యక్రమాలు చేపడుతుండటం ఈ కౌంటర్‌పై ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు.