25 ఏళ్లలో 3 లక్షల% రిటర్న్‌-మదర్‌సన్‌ సుమీ!

25 ఏళ్లలో 3 లక్షల% రిటర్న్‌-మదర్‌సన్‌ సుమీ!

ఆటోవిడిభాగాల దేశీ దిగ్గజం మదర్‌సన్ సుమీ సిస్టమ్స్‌ షేరు గడిచిన 25ఏళ్లలో 3,00,000 శాతం రిటర్నులు అందించింది. ఈ నెల 9కల్లా కంపెనీ స్టాక్‌ ఎక్స్ఛేంజీలలో లిస్టయి 25 వసంతాలు పూర్తి చేసుకుంది. దీంతో వాటాదారులకు 1:2 నిష్పత్తిలో బోనస్‌ షేర్లను జారీ చేసేందుకు బోర్డు నిర్ణయించింది. తద్వారా ప్రస్తుత వాటాదారులకు తమ దగ్గరున్న ప్రతీ 2 షేర్లకూ మరో షేరుని ఫ్రీగా జారీ చేయనుంది. కాగా.. మదర్‌సన్‌ షేరు తొలుత ఎన్‌ఎస్‌ఈలో రూ. 294ను అధిగమించింది. ప్రస్తుతం దాదాపు 2 శాతం క్షీణించి రూ. 286 వద్ద ట్రేడవుతోంది.
కంపెనీ ప్రస్థానం ఇలా
25 ఏళ్లక్రితం బీఎస్ఈలో మదర్‌సన్‌ సుమీ షేరు రూ. 41 వద్ద లిస్టయ్యింది. తదుపరి బోనస్‌లు, షేర్ల విభజన, డివిడెండ్లతో కలుపుకుంటే ఇప్పటివరకూ 3,22,881 శాతం రిటర్నులను అందించినట్లు కంపెనీ తాజాగా పేర్కొంది. అంటే కంపెనీలో 1993లో రూ. 100 ఇన్వెస్ట్‌ చేస్తే పెట్టుబడి గత వారాంతానికల్లా రూ. 3,22,881కు చేరేదని కంపెనీ వివరించింది. 1993 సెప్టెంబర్‌ 9న రూ. 10 ముఖ విలువగల మదర్‌సన్‌ షేరు రూ. 41 వద్ద లిస్టయ్యింది. కాగా.. గత రెండు దశాబ్దాలలోనూ కంపెనీ 17 సంస్థలను కొనుగోలు చేసింది. ఈ జాబితాలో 2009 మార్చిలో విసీకార్ప్‌, 2011 నవంబర్‌లో పెగూఫామ్‌, 2014 ఆగస్ట్‌లో స్టోన్‌రిడ్జ్‌ వైరింగ్‌ హారెన్స్‌, 2015 జనవరిలో స్కీరర్‌ అండ్‌ టైర్‌, 2017 మార్చిలో రేడెల్‌ ఆటోమోటివ్‌ ఉన్నాయి. 
గత దశాబ్దంలో
గత దశాబ్ద కాలంలో మదర్‌సన్ సుమీ భారీ వృద్ధి బాటలో సాగుతూ వచ్చింది. అమ్మకాలు వార్షిక ప్రాతిపదికన 21 శాతంపైగా పురోగతి సాధించగా.. నికర లాభాలు మరింత అధికంగా దాదాపు 33 శాతం చొప్పున జంప్‌చేశాయి. రిటర్న్‌ ఆన్‌ ఈక్విటీ(ఆర్‌వోఈ)ని 20-22 శాతం స్థాయిలో నిలుపుకుంటూ వచ్చింది. కాగా.. ఈ ఏడాది తొలి త్రైమాసికం(ఏప్రిల్‌-జూన్‌)లో నికర లాభం 59 శాతం దూసుకెళ్లి రూ. 443 కోట్లను తాకింది. అయితే ఇకపై ముడి వ్యయాలు, సామర్థ్య విస్తరణలో ఆలస్యం, రుణ భారం, పెరుగుతున్న పోటీ, విదేశీ మారక రిస్కులు వంటి అంశాలు కంపెనీకి ప్రతిబంధకాలు సృష్టించే అవకాశమున్నదని పలువురు విశ్లేషకులు పేర్కొంటున్నారు. మరోపక్క మరికొంతమంది నిపుణులు ఇకపైనా కంపెనీ పటిష్ట పనితీరును చూపే వీలున్నట్లు అభిప్రాయపడ్డారు. ఆర్డర్‌బుక్‌, విస్తరణ వంటి అంశాలు ఇందుకు సహకరించగలవని చెబుతున్నారు. బ్రోకింగ్‌ సంస్థ ఎడిల్‌వీజ్‌ ఇకపై ఆదాయం, మార్జిన్లలో వృద్ధి మందగించవచ్చని అంచనా వేసింది. అయితే రూ. 349 టార్గెట్‌ ధరతో కొనుగోలుకి సిఫారసు చేస్తోంది. Most Popular