ఏబీబీ ఇండియాకు ఎలక్ట్రిక్‌ వాహన జోష్‌

ఏబీబీ ఇండియాకు ఎలక్ట్రిక్‌ వాహన జోష్‌

పర్యావరణ పరిరక్షణ బాటలో రానున్న ఐదేళ్లలో ఎలక్ట్రిక్‌ వాహన వినియోగాన్ని భారీగా పెంచాలని కేంద్ర ప్రభుత్వం వేస్తున్న ప్రణాళికలు ఏబీబీ ఇండియా లిమిటెడ్‌ కౌంటర్‌కు జోష్‌నిస్తున్నాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు దాదాపు 3 శాతం ఎగసి రూ. 1429 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో 6 శాతం వరకూ జంప్‌చేసి రూ. 1445ను తాకింది. ఇది ఆరు నెలల గరిష్టంకాగా.. తద్వారా వరుసగా ఐదో రోజు లాభాల బాటలో సాగుతోంది. గత వారం రోజుల్లోనే ఈ షేరు 18 శాతం లాభపడటం ప్రస్తావించదగ్గ అంశం. 
మోడీతో సీఈవో భేటీ
గత వారాంతాన పవర్‌, ఆటోమేషన్‌ టెక్నాలజీ, ఇంజినీరింగ్‌ దిగ్గజం ఏబీబీ ఇండియా లిమిటెడ్‌ సీఈవో అల్‌రిచ్‌ స్పీస్‌హోఫర్‌ ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. దేశంలో ప్రజా రవాణా వ్యవస్థను విద్యుత్‌శక్తితో నడిచే విధంగా మార్పు చేసేందుకు వీలైన అవకాశాల పరిశీలనపై సమావేశంలో చర్చలు జరిగినట్లు ఏబీబీ ఇండియా పేర్కొంది. న్యూఢిల్లీలో జరిగిన మూవ్‌ సదస్సు సందర్భంగా ప్రధానితో సీఈవో భేటి అయినట్లు తెలియజేసింది. కేంద్ర ప్రభుత్వం 2022కల్లా 227 గిగావాట్స్‌ పునరుత్పాదక ఇంధనాన్ని ఉత్పత్తి చేయాలన్న లక్ష్యం పెట్టుకున్న నేపథ్యంలో మోడీతో స్పీస్‌హోఫర్‌ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడినట్లు నిపుణులు పేర్కొంటున్నారు. కాలుష్యకారకాలకు చెక్ పెట్టేబాటలో కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్‌ వాహన వినియోగానికి మద్దతు ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే వీటికి పర్మిట్‌ వ్యవస్థ నుంచి వెసులుబాటును సైతం కల్పించింది. దేశీయంగా గతేడాది 2,000 ఎలక్ట్రిక్‌ వాహనాలు విక్రయమైనట్లు అంచనా. కాగా.. కంపెనీ గ్రిడ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌సహా ఆటోమేషన్, పవర్‌ మేనేజ్‌మెంట్‌, ఎలక్ట్రిఫికేషన్‌ తదితర పలు సేవలను అందిస్తున్న విషయం విదితమే.Most Popular