ఏటూజెడ్‌, నారాయణ హృదయాలయ అప్‌

ఏటూజెడ్‌, నారాయణ హృదయాలయ అప్‌

బంగ్లాదేశ్‌లో విస్తరణ వార్తలతో నారాయణ హృదయాలయ కౌంటర్‌ వెలుగులోకి రాగా.. తాజాగా కాంట్రాక్టు పొందినట్లు వెల్లడికావడంతో ఏటూజెడ్‌ ఇన్‌ఫ్రా కౌంటర్‌కు డిమాండ్‌ కనిపిస్తోంది. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో నారాయణ హృదయాలయ షేరు 1.5 శాతం పుంజుకుని రూ. 254 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 258 వద్ద గరిష్టాన్నీ, రూ. 252 వద్ద కనిష్టాన్నీ తాకింది. ఇక ఏటూజెడ్‌ ఇన్‌ఫ్రా ఇంజినీరింగ్‌ షేరు 3.5 శాతం జంప్‌చేసి రూ. 19.60 వద్ద కదులుతోంది. ఇంట్రాడేలో రూ. 20.50 వరకూ ఎగసింది. అయితే తొలుత రూ. 18.50 వద్ద 52 వారాల కనిష్టాన్ని చవిచూడటం గమనించదగ్గ అంశం!


నారాయణ హృదయాలయ
బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్‌లో గల ఇంపీరియల్‌ ఆసుపత్రితో జత కట్టేందుకు తప్పనిసరి ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు నారాయణ హృదయాలయ తాజాగా వెల్లడించింది. అనుబంధ సంస్థ ఎన్‌హెచ్‌ హెల్త్‌ బంగ్లాదేశ్‌ ద్వారా భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు తెలియజేసింది. దీంతో ఇంపీరియల్‌ హాస్పిటల్‌లో కార్డియాక్‌ సైన్సెస్ విభాగం నిర్వహణ తదితర కార్యకలాపాలు చేపట్టనున్నట్లు వివరించింది.
కంపెనీలో ప్రమోటర్లకు దాదాపు 64 శాతం వాటా ఉంది. 350 పడకలతో ఏర్పాటవుతున్న ఇంపీరియల్‌ హాస్పిటల్‌ ఆరు నెలల్లోగా ప్రారంభంకానున్నట్లు అంచనా వేస్తున్నారు.


ఏటూజెడ్‌ ఇన్‌ఫ్రా
నేపాల్‌ ఎలక్ట్రిసిటీ అధారిటీ నుంచి కాంట్రాక్ట్‌ పొందినట్లు ఏటూజెడ్‌ ఇన్‌ఫ్రా ఇంజినీరింగ్‌ తాజాగా వెల్లడించింది. కాంట్రాక్టు విలువ దాదాపు రూ. 95 కోట్లుగా పేర్కొంది. కాంట్రాక్ట్‌లో భాగంగా 11/0.4 కేవీ పంపిణీ వ్యవస్థకు సంబంధించిన డిజైన్‌, సప్లై, ఇన్‌స్టాలేషన్, టెస్టింగ్‌ తదితర కార్యక్రమాలను చేపట్టవలసి ఉంటుందని వివరించింది.Most Popular