చమురు మంట- పెట్రో షేర్లు దిగాలు

చమురు మంట- పెట్రో షేర్లు దిగాలు

అంతర్జాతీయ మార్కెట్లలో ముడిచమురు ధరలు మళ్లీ పరుగుతీస్తుండటంతో దేశీయంగా పెట్రో మార్కెటింగ్‌ కంపెనీల కౌంటర్లు డీలాపడ్డాయి. ఇన్వెస్టర్లు అమ్మకాలకు దిగడంతో భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌(బీపీసీఎల్‌), హిందుస్తాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌(హెచ్‌పీసీఎల్‌), ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌(ఐవోసీ) కౌంటర్లు తాజాగా 52 వారాల కనిష్టాలను తాకాయి. ప్రస్తుతం ఎన్ఎస్‌ఈలో హెచ్‌పీసీఎల్‌ షేరు ప్రస్తుతం 2.75 శాతం క్షీణించి రూ. 237 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 234 దిగువకు జారింది. ఈ బాటలో బీపీసీఎల్‌ 1.55 శాతం నీరసించి రూ. 333 దిగువన ట్రేడవుతోంది. తొలుత రూ. 330 దిగువకు పతనమైంది. ఇక ఐవోసీ ప్రస్తుతం 2.3 శాతం నష్టంతో రూ. 147 వద్ద కదులుతోంది. తొలుత ఒక దశలో రూ. 146 దిగువకు క్షీణించింది. 
నేలచూపులో
ఉత్పత్తిలో ఒపెక్‌, రష్యాల కోతల కారణంగా గత కొద్ది నెలలుగా విదేశీ మార్కెట్లో ముడిచమురు ధరలు మండుతున్నాయి. మరోపక్క డాలరుతో మారకంలో రూపాయి విలువ ఏడాది కాలంలో 14 శాతం వరకూ జారింది. దీంతో ఈ కేలండర్‌ ఏడాదిలో ఆయిల్‌ మార్కెటింగ్ కంపెనీల షేర్లు అమ్మకాలకు లోనవుతూ వస్తున్నాయి. ముడిచమురు ధరలు పెరిగితే స్థూల రిఫైనింగ్‌ మార్జిన్లు(జీఆర్‌ఎం) క్షీణించే సంగతి తెలిసిందే. ధరల ఆటుపోట్ల కారణంగా చమురు నిల్వల విలువలోనూ మార్పులు చోటుచేసుకుంటాయి. ఫలితంగా జనవరి మొదలు ఇప్పటివరకూ హెచ్‌పీసీఎల్‌ కౌంటర్ 42 శాతం పతనంకాగా.. బీపీసీఎల్‌ 36 శాతం తిరోగమించింది. ఇక ఐవోసీ సైతం 24 శాతం నష్టపోయింది. ఇదే కాలంలో సెన్సెక్స్‌ 10 శాతం లాభపడటం గమనించదగ్గ అంశం! 
ఇతర షేర్లు సైతం
రిఫైనింగ్ పీఎస్‌యూల బాటలో మంగళూర్‌ రిఫైనరీ అండ్‌ పెట్రోకెమికల్స్‌(ఎంఆర్‌పీఎల్‌) కౌంటర్‌ 1.4 శాతం నీరసించి రూ. 73 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 73 దిగువన 52 వారాల కనిష్టాన్ని తాకింది. ఈ బాటలో చెన్నై పెట్రోలియం(సీపీసీఎల్‌) 2 శాతం తిరోగమించి రూ. 275 దిగువన కదులుతోంది. తొలుత ఒక దశలో రూ. 271 వరకూ జారింది. కాగా.. ఈ ఏడాది ఇప్పటివరకూ ఎంఆర్‌పీఎల్‌ షేరు 47 శాతం నష్టపోగా.. సీపీసీఎల్‌ సైతం 41 శాతం క్షీణించింది.Most Popular