ఇండొనేసియా ప్లస్‌- ఆసియా డౌన్‌

ఇండొనేసియా ప్లస్‌- ఆసియా డౌన్‌

దిగుమతి సుంకాల విధింపు అంశంలో ఏర్పడ్డ వివాద పరిష్కారాలకు సహకరించనందున అమెరికాపై ఆంక్షలు విధించాలంటూ ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యూటీవో)ను చైనా కోరింది. డంపింగ్‌ డ్యూటీల విషయంలో నిబంధనలు పాటించనందున ఏడాదికి 700 కోట్ల డాలర్ల విలువైన అమెరికా వాణిజ్యంపై ఆంక్షలు విధించాలంటూ తాజాగా చైనా డబ్ల్యూటీవోను డిమాండ్‌ చేసింది. కాగా.. గత శుక్రవారం చైనా మొత్తం దిగుమతులపై సుంకాలు విధిస్తామంటూ హెచ్చరించిన ట్రంప్‌ ప్రభుత్వం మంగళవారం మరోసారి చైనాతో కఠినంగా వ్యవహరించనున్నట్లు పేర్కొంది. మరోపక్క అర్జెంటీనా, టర్కీలలో సంక్షోభాలు కొనసాగుతూనే ఉన్నాయి. 
మార్కెట్లు అటూఇటూ..
పలు ప్రతికూల అంశాల నేపథ్యంలో మంగళవారం యూరోపియన్‌ స్టాక్‌ మార్కెట్లు మిశ్రమంగా ముగియగా.. టెక్నాలజీ, ఇంధన దిగ్గజాల అండతో అమెరికా మార్కెట్లు లాభాలతో ముగిశాయి. కాగా.. ప్రస్తుతం ఆసియాలో ఇండొనేసియా మినహా మిగిలిన మార్కెట్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ఇండొనేసియా 0.55 శాతం పుంజుకోగా, థాయ్‌లాండ్‌ యథాతథంగా ట్రేడవుతోంది. మిగిలిన మార్కెట్లలో జపాన్‌, హాంకాంగ్‌, తైవాన్‌, చైనా, దక్షిణ కొరియా 0.4 శాతం స్థాయిలో నష్టపోయాయి. సింగపూర్‌ నామమాత్ర నష్టంతో కదులుతోంది.  

డాలరు ప్లస్
మార్చి మొదలు ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో 8 శాతం ర్యాలీ చేసిన డాలరు ప్రస్తుతం 0.15 శాతం బలపడింది. 95.12కు చేరింది. మరోపక్క జపనీస్‌ యెన్‌ 111.50కు బలహీనపడగా..  యూరో స్వల్ప వెనకడుగుతో 1.159 వద్ద కదులుతోంది. చైనీస్‌ యువాన్‌ 6.87 వద్ద ట్రేడవుతోంది. Most Popular