రూపాయి.. నేలచూపులో రికార్డ్‌!

రూపాయి.. నేలచూపులో రికార్డ్‌!

డాలరుతో మారకంలో మంగళవారం పతనమైన దేశీ కరెన్సీ మళ్లీ డీలాపడింది. ఇంటర్‌బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్లో రూపాయి మంగళవారం ముగింపుతో పోలిస్తే 20 పైసలు(0.28 శాతం) బలహీనపడింది. 72.89ను తాకింది. ప్రస్తుతం 72.88 వద్ద ట్రేడవుతోంది. ఇది చరిత్రాత్మక కనిష్టంకాగా.. సోమవారం నాటి పతనంనుంచి బయటపడి తొలుత బలాన్ని పుంజుకున్న రూపాయి మంగళవారం చివరికి బలహీనపడింది. తద్వారా రూపాయి మారకపు విలువ 24 పైసలు(0.3 శాతం) క్షీణించి 74.69 వద్ద ముగిసింది. సోమవారం సైతం రూపాయి 72 పైసలు పడిపోయి 72.45 వద్ద ముగియడం ద్వారా సరికొత్త కనిష్టానికి చేరిన సంగతి తెలిసిందే. కాగా.. వరుసగా నాలుగో నెలలోనూ ఆర్‌బీఐ నికరంగా డాలర్లను విక్రయించింది. జులైలో స్పాట్‌ మార్కెట్లో 187 కోట్ల విలువైన డాలర్లను విక్రయించింది. ఇదే విధంగా జూన్‌లో 6.184 బిలియన్‌ డాలర్లు, మేలో 5.767 బిలియన్‌ డాలర్లు, ఏప్రిల్‌లో 2.483 బిలియన్‌ డాలర్లను ఆర్‌బీఐ విక్రయించినట్లు డేటా వెల్లడించింది. 

14 శాతం డౌన్‌
ఈ ఏడాది ఇప్పటివరకూ రూపాయి మారకపు విలువ 14 శాతం ఆవిరైంది. గత నెల రోజుల్లో 6 శాతం కోల్పోగా.. గత 9 సెషన్లలోనే 4 శాతం క్షీణించింది. కాగా..  రూపాయి మారకపు విలువ 70 నుంచి 72కు 21 సెషన్లలోనే  నీరసించింది. ఆగస్ట్‌ 13న తొలిసారిగా 70 మార్క్‌ను తాకిన రూపాయి ప్రస్తుతం 73 సమీపానినిక బలహీనపడింది.

విదేశీ కారణాలు
ఇటీవల ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు బలపడుతుంటే వర్థమాన దేశాల కరెన్సీలు పతనబాటలో సాగుతున్నాయి. మార్చి మొదలు ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు 8 శాతం ర్యాలీ చేసింది. ఓవైపు అర్జెంటీనా, టర్కీల ఆర్థిక సంక్షోభాలు కొనసాగుతుండగా.. మరోపక్క కరెన్సీ రుపయ్యా పతనాన్ని అడ్డుకునేందుకు ఇండొనేసియా కేంద్ర బ్యాంకు సైతం పలుమార్లు చర్యలు తీసుకుంది. ఈ నేపథ్యంలో డాలరుతో మారకంలో పలు వర్థమాన దేశాల కరెన్సీలు పతనమవుతూ వస్తున్న సంగతి తెలిసిందే. దీంతో రూపాయిపై సైతం ప్రతికూల ప్రభావం పడుతున్నట్లు ఫారెక్స్‌ వర్గాలు పేర్కొన్నాయి.  

దేశీయంగానూ
ఇటీవల తిరిగి జోరందుకున్న ముడిచమురు ధరలు రూపాయి మారకపు విలువపై ఒత్తిడిని పెంచుతున్నాయి. దేశీ అవసరాలకు 75 శాతం చమురును దిగుమతి చేసుకోవలసి ఉండటంతో దిగుమతుల బిల్లు పెరగనుంది. ఇందుకు సంకేతంగా జులైలో వాణిజ్య లోటు నాలుగేళ్ల గరిష్టానికి చేరిన విషయాన్ని ఆర్థికవేత్తలు ప్రస్తావిస్తున్నారు. మరోవైపు అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడరల్‌ రిజర్వ్‌ క్రమంగా వడ్డీ రేట్ల పెంపును చేపట్టనున్నట్లు సంకేతాలిచ్చింది. దీంతో డాలరు బలపడుతుంటే.. ఆసియా కరెన్సీలు బలహీనపడుతున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు.



Most Popular