ఫ్లాట్‌ ఓపెనింగ్‌ నేడు?

ఫ్లాట్‌ ఓపెనింగ్‌ నేడు?

దేశీ స్టాక్‌ మార్కెట్లు నేడు అక్కడక్కడే అన్నట్టు(ఫ్లాట్‌)గా ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ప్రస్తుతం సింగపూర్(ఎస్‌జీఎక్స్) నిఫ్టీ 4 పాయింట్ల నామమాత్ర లాభంతో 11,325 వద్ద ట్రేడవుతోంది. సాధారణంగా దేశీ మార్కెట్ల ట్రెండ్‌ను ఎస్‌జీఎక్స్ నిఫ్టీ ప్రతిఫలిస్తూ ఉంటుంది. కాగా.. మంగళవారం మరోసారి అమ్మకాలు వెల్లువెత్తడంతో వరుసగా రెండో రోజు దేశీ స్టాక్‌ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. మరోవైపు డాలరుతో మారకంలో రూపాయి 73 మార్క్‌ సమీపానికి పతనమైంది. 72.73 వద్ద రుపీ చరిత్రాత్మక కనిష్టాన్ని తాకగా.. ట్రేడింగ్ ముగిసేసరికి సెన్సెక్స్‌ 509 పాయింట్లు దిగజారి 37,413 వద్ద నిలిచింది. నిఫ్టీ సైతం 151 పాయింట్లు కోల్పోయి 11,287 వద్ద స్థిరపడింది. 

నిఫ్టీ కదలికలు ఇలా..! 
నేడు నిఫ్టీ బలహీనపడితే తొలుత 11,214 పాయింట్ల వద్ద, తదుపరి 11,141 స్థాయిలోనూ మద్దతు లభించే వీలున్నదని సాంకేతిక నిపుణులు అంచనా వేశారు. ఒకవేళ ఊపందుకుంటే.. తొలుత 11,420 పాయింట్ల వద్ద, తదుపరి 11,552 స్థాయిలోనూ రెసిస్టెన్స్‌ ఎదురుకావచ్చని భావిస్తున్నారు. బ్యాంక్‌ నిఫ్టీకి 26614, 26420 పాయింట్ల వద్ద మద్దతు.. 27160, 27512 వద్ద రెసిస్టెన్స్‌ కనిపించే వీలున్నట్లు పేర్కొన్నారు.

ఎఫ్‌పీఐల భారీ అమ్మకాలు 
నగదు విభాగంలో సోమవారం దాదాపు రూ. 842 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించిన విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) మంగళవారం మరింత అధికంగా రూ. 1454 కోట్లకుపైగా పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. మరోవైపు సోమవారం రూ. 290 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించిన దేశీ ఫండ్స్‌(డీఐఐలు) మంగళవారం దాదాపు రూ. 750 కోట్లను ఇన్వెస్ట్‌ చేశాయి.

 Most Popular