హుష్‌.. అటు రుపీ-ఇటు మార్కెట్లు!

హుష్‌.. అటు రుపీ-ఇటు మార్కెట్లు!

మిడ్‌సెషన్‌వరకూ స్వల్ప ఆటుపోట్ల మధ్య కదిలిన దేశీ స్టాక్‌ మార్కెట్లు ఉన్నట్టుండి అమ్మకాల ఒత్తిడిలో పడ్డాయి. మరోపక్క డాలరుతో మారకంలో సోమవారం నాటి పతనంనుంచి బయటపడి తొలుత బలాన్ని పుంజుకున్న రూపాయి సైతం బలహీనపడింది. వెరసి అటు మార్కెట్లు.. ఇటు రూపాయిలో సమయం గడిచేకొద్దీ అమ్మకాలు ఊపందుకున్నాయి. ఫలితంగా రూపాయి 72.73 వద్ద చరిత్రాత్మక కనిష్టాన్ని తాకగా.. సెన్సెక్స్‌ 500 పాయింట్లకుపైగా పతనమైంది. సోమవారం సైతం రూపాయి, మార్కెట్లు తిరోగమించిన సంగతి తెలిసిందే. కాగా.. సెన్సెక్స్‌ మరోసారి 509 పాయింట్లు దిగజారింది. 37,413 వద్ద ముగిసింది. ఈ బాటలో నిఫ్టీ 151 పాయింట్లు కోల్పోయి 11,287 వద్ద స్థిరపడింది. వెరసి మార్కెట్లు 2016 ఫిబ్రవరి తరువాత వరుసగా రెండు రోజులపాటు 1 శాతం చొప్పున  పతనమైన రికార్డును నెలకొల్పాయి.
అన్ని రంగాలూ
ఎన్‌ఎస్‌ఈలో అన్ని రంగాలూ 2-1.5 శాతం మధ్య పతనమయ్యాయంటే అమ్మకాల తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ఐటీ మాత్రమే 0.7 శాతం క్షీణించింది. నిఫ్టీ దిగ్గజాలలో టైటన్‌, టాటా స్టీల్‌, ఐటీసీ, టాటా మోటార్స్‌, పవర్‌గ్రిడ్‌, హీరోమోటో, టెక్‌ మహీంద్రా, ఐబీ హౌసింగ్‌, యూపీఎల్‌, ఎయిర్‌టెల్‌ 4.5-2.4 శాతం తిరోగమించాయి. బ్లూచిప్స్‌లో కేవలం కోల్‌ ఇండియా, ఎంఅండ్ఎం, ఎన్‌టీపీసీ, ఇన్ఫోసిస్‌ చెప్పుకోదగ్గ స్థాయిలో 1.7-0.4 శాతం మధ్య బలపడ్డాయి.
చిన్న షేర్లు డౌన్‌
మార్కెట్ల బాటలో చిన్న షేర్లలోనూ అమ్మకాలు ఊపందుకున్నాయి. బీఎస్ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ ఇండెక్సులు 1.4 శాతం చొప్పున క్షీణించాయి. ట్రేడైన మొత్తం షేర్లలో 1840 నష్టపోగా.. 875 మాత్రమే లాభాలతో ముగిశాయి. 
రెండువైపులా అమ్మకాలు
సోమవారం నగదు విభాగంలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) దాదాపు రూ. 842 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించగా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 290 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి.Most Popular