రుపీ... మళ్లీ ఠపీ..!

రుపీ... మళ్లీ ఠపీ..!

డాలరుతో మారకంలో సోమవారం భారీ పతనాన్ని చవిచూసిన దేశీ కరెన్సీ మరోసారి కుదేలైంది. ఇంటర్‌బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్లో సోమవారం ముగింపుతో పోలిస్తే 28 పైసలు(0.3 శాతం) బలహీనపడింది. 72.73ను తాకింది. ఇది సరికొత్త కనిష్టంకాగా.. సోమవారం సైతం రూపాయి 72 పైసలు పడిపోయి 72.45 వద్ద ముగియడం ద్వారా చరిత్రాత్మక కనిష్టానికి చేరింది. కాగా.. డాలరుతో మారకంలో ఏడు రోజుల క్షీణ పథానికి బ్రేక్‌వేస్తూ.. రుపీ గత వారాంతాన 16 పైసలు బలపడి 71.73 వద్ద ముగిసిన సంగతి తెలిసిందే. తదుపరి ఒక్క రోజులోనే తిరిగి తిరోగమన పథంలో పడటం ప్రస్తావించదగ్గ అంశం. నిజానికి నేటి ట్రేడింగ్‌లో తొలుత ఇంటర్‌బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్‌లో డాలరుతో మారకంలో రూపాయి 15 పైసలు బలపడింది. 72.30 వద్ద ప్రారంభమైంది. తదుపరి మిడ్‌సెషన్‌నుంచీ డాలర్లకు డిమాండ్‌ పెరగడంతో ఒక్కసారిగా నీరసించింది. ప్రస్తుతం 17 పైసల నష్టంతో 72.62 వద్ద ట్రేడవుతోంది.   

14 శాతం డౌన్‌
ఈ ఏడాది ఇప్పటివరకూ రూపాయి మారకపు విలువ 14 శాతం ఆవిరైంది. గత నెల రోజుల్లో 6 శాతం కోల్పోగా.. గత 9 సెషన్లలోనే 4 శాతం క్షీణించింది. కాగా..  రూపాయి మారకపు విలువ 70 నుంచి 72కు 21 సెషన్లలోనే  నీరసించింది. ఆగస్ట్‌ 13న తొలిసారిగా 70 మార్క్‌ను తాకిన రూపాయి ప్రస్తుతం 73 సమీపానినిక బలహీనపడింది.

విదేశీ కారణాలు
ఇటీవల ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు బలపడుతుంటే వర్థమాన దేశాల కరెన్సీలు పతనబాటలో సాగుతున్నాయి. మార్చి మొదలు ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు 8 శాతం ర్యాలీ చేసింది. ఓవైపు అర్జెంటీనా, టర్కీల ఆర్థిక సంక్షోభాలు కొనసాగుతుండగా.. మరోపక్క కరెన్సీ రుపయ్యా పతనాన్ని అడ్డుకునేందుకు ఇండొనేసియా కేంద్ర బ్యాంకు సైతం పలుమార్లు చర్యలు తీసుకుంది. ఈ నేపథ్యంలో డాలరుతో మారకంలో పలు వర్థమాన దేశాల కరెన్సీలు పతనమవుతూ వస్తున్న సంగతి తెలిసిందే. దీంతో రూపాయిపై సైతం ప్రతికూల ప్రభావం పడుతున్నట్లు ఫారెక్స్‌ వర్గాలు పేర్కొన్నాయి.  

దేశీయంగానూ
ఇటీవల తిరిగి జోరందుకున్న ముడిచమురు ధరలు రూపాయి మారకపు విలువపై ఒత్తిడిని పెంచుతున్నాయి. దేశీ అవసరాలకు 75 శాతం చమురును దిగుమతి చేసుకోవలసి ఉండటంతో దిగుమతుల బిల్లు పెరగనుంది. ఇందుకు సంకేతంగా జులైలో వాణిజ్య లోటు నాలుగేళ్ల గరిష్టానికి చేరిన విషయాన్ని ఆర్థికవేత్తలు ప్రస్తావిస్తున్నారు. మరోవైపు అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడరల్‌ రిజర్వ్‌ క్రమంగా వడ్డీ రేట్ల పెంపును చేపట్టనున్నట్లు సంకేతాలిచ్చింది. దీంతో డాలరు బలపడుతుంటే.. ఆసియా కరెన్సీలు బలహీనపడుతున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు.Most Popular