పీఎఫ్‌సీ ఫలితాలు ఓకే- షేరు పతనం!

పీఎఫ్‌సీ ఫలితాలు ఓకే- షేరు పతనం!

ఈ ఆర్థిక సంవత్సరం తొలి క్వార్టర్‌లో ప్రోత్సాహకర ఫలితాలు ప్రకటించినప్పటికీ విద్యుత్‌ రంగ ఆర్థిక సేవల ప్రభుత్వ సంస్థ పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌(పీఎఫ్‌సీ) కౌంటర్‌లో అమ్మకాలు ఊపందుకున్నాయి. ప్రస్తుతం ఎన్ఎస్‌ఈలో ఈ షేరు 7.6 శాతం పతనమైంది. రూ. 82 దిగువన ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 90-81 మధ్య గరిష్ట, కనిష్టాలను చవిచూసింది. కంపెనీలో ప్రభుత్వానికి 65.61 శాతం వాటా ఉంది.
ఫలితాలు ఇలా
ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్‌-జూన్‌)లో పీఎఫ్‌సీ నికర లాభం 22 శాతంపైగా ఎగసి రూ. 1373 కోట్లను అధిగమించింది. మొత్తం ఆదాయం సైతం 4 శాతం పెరిగి రూ. 7052 కోట్లను తాకింది. ప్రాజెక్ట్‌ టెర్మ్‌లోన్లు, లీజ్‌ ఫైనాన్సింగ్‌, బిల్స్‌ డిస్కౌంటింగ్‌ తదితర ఆర్థిక సేవలతోపాటు.. జనరేషన్, ట్రాన్స్‌మిషన్‌, డిస్ట్రిబ్యూషన్‌ తదితర విద్యుత్‌ రంగ సంబంధ కన్సల్టెన్సీ సర్వీసులను సైతం అందిస్తుంటుంది. తద్వారా పవర్‌ప్లాంట్ల ఆధునీకరణ, విస్తరణ వంటి కార్యకలాపాలకు ఫైనాన్షియల్‌ సపోర్ట్‌ను సమకూరుస్తోంది. 

సన్‌ ఫార్మా
ఇజ్రాయెల్‌ స్టార్టప్‌ కంపెనీ టార్షియస్‌లో 18.75 శాతం వాటాను కొనుగోలు చేసేందుకు విదేశీ అనుబంధ సంస్థ ద్వారా ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు వెల్లడించడంతో తొలుత జోరందుకున్న హెల్త్‌కేర్ దిగ్గజం సన్‌ ఫార్మా కౌంటర్‌ తిరిగి వెనకడుగు వేస్తోంది. మార్కెట్లు పతనబాట పట్టడంతో ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో ఈ షేరు 1.35 శాతం క్షీణించి రూ. 630 దిగువన ట్రేడవుతోంది. అయితే తొలుత రూ. 649 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. టార్షియస్‌లో వాటాను 30 లక్షల డాలర్ల(రూ. 21 కోట్లు)కు కొనుగోలు చేయనున్నట్లు సన్‌ ఫార్మా తెలియజేసింది.Most Popular