శాక్‌సాఫ్ట్‌- రేటింగ్‌ జోష్‌

శాక్‌సాఫ్ట్‌- రేటింగ్‌ జోష్‌

రేటింగ్‌ అప్‌గ్రేడ్‌ కారణంగా సాఫ్ట్‌వేర్‌ సేవల చిన్న తరహా కంపెనీ శాక్‌సాఫ్ట్‌ లిమిటెడ్‌ కౌంటర్‌కు డిమాండ్‌ ఊపందుకుంది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 4.5 శాతం జంప్‌చేసి రూ. 315 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో 14 శాతం దూసుకెళ్లింది. రూ. 342 వద్ద సరికొత్త గరిష్టాన్ని తాకింది. ఈ షేరు గత రెండు రోజుల్లోనూ 6 శాతం ర్యాలీ చేయడం గమనార్హం!
కేర్‌ ఎఫెక్ట్‌
కంపెనీ దీర్ఘకాలిక బ్యాంక్‌ సౌకర్యాల(రుణ చెల్లింపుల సామర్థ్యం)ను రేటింగ్‌ సంస్థ కేర్‌(సీఏఆర్‌ఈ) అప్‌గ్రేడ్‌ చేయడంతో శాక్‌సాఫ్ట్‌ కౌంటర్‌ వెలుగులోకి వచ్చింది. అధిక మార్జిన్లుగల ఇన్ఫర్మేషన్‌ సర్వీసెస్‌ మేనేజ్‌మెంట్ విభాగంలోకి ప్రవేశించడం ద్వారా శాక్‌సాఫ్ట్‌ పటిష్ట వృద్ధిని సాధించే వీలున్నట్లు కేర్‌ అభిప్రాయపడింది. ఇటీవల ఇతర కంపెనీలను కొనుగోలు చేయడం, సేవలను విస్తరించడం వంటి అంశాల కారణంగా మార్జిన్లు బలపడనున్నట్లు అంచనా వేసింది. రుణ భారం తక్కువగా ఉండటంతోపాటు కేపిటల్‌ స్ట్రక్చర్‌ పటిష్టంగా ఉండటంతో శాక్‌సాఫ్ట్‌కు పాజిటివ్‌ ఔట్‌లుక్‌ను కేర్‌ ప్రకటించింది.
43 శాతం ర్యాలీ
గత నెల రోజుల్లో శాక్‌సాఫ్ట్‌ కౌంటర్‌ 43 శాతం ర్యాలీ చేసింది. ఇందుకు ఈ ఏడాది తొలి క్వార్టర్‌ ఫలితాలు దోహదం చేశాయి. క్యూ1(ఏప్రిల్‌-జూన్‌)లో కంపెనీ నికర లాభం కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన 86 శాతం ఎగసింది. దాదాపు రూ. 7 కోట్ల నికర లాభం ఆర్జించింది. నిర్వహణ ఆదాయం సైతం 26 శాతంపైగా పుంజుకుని రూ. 82 కోట్లను అధిగమించింది.  Most Popular