యూరప్‌, ఆసియా మార్కెట్లు వీక్‌

యూరప్‌, ఆసియా మార్కెట్లు వీక్‌

అమెరికా, చైనా మధ్య వాణిజ్య వివాదాలు కొనసాగుతుండటం, యూరోపియన్‌ యూనియన్‌(ఈయూ) వాణిజ్య విధానాలపై ట్రంప్‌ ప్రభుత్వం అసంతృప్తి వంటి అంశాల నేపథ్యంలో యూరోపియన్‌ స్టాక్‌ మార్కెట్లు బలహీనంగా ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం యూకే ఇండెక్స్‌ ఎఫ్‌టీఎస్‌ఈ 0.4 శాతం, ఫ్రాన్స్‌ ఇండెక్స్‌ సీఏసీ 0.25 శాతం చొప్పున క్షీణించగా జర్మన్‌ ఇండెక్స్‌ డాక్స్‌ మాత్రం నామమాత్ర లాభంతో ట్రేడవుతోంది. ఇక ఆసియా మార్కెట్లలో జపాన్‌ 1.3 శాతం పుంజుకోగా.. తైవాన్‌ 0.25 శాతం బలపడింది. మిగిలిన మార్కెట్లలో హాంకాంగ్‌, సింగపూర్‌, థాయ్‌లాండ్‌, కొరియా, చైనా 0.7-0.2 శాతం మధ్య నష్టపోయాయి. ఇండొనేసియా మార్కెట్‌కు సెలవు.

ఆర్సెలర్‌ మిట్టల్‌ డౌన్‌
స్టీల్‌ దిగ్గజం ఆర్సెలర్‌ మిట్టల్‌ 3 శాతంపైగా తిరోగమించింది. ఎస్సార్‌ స్టీల్‌ను కొనుగోలు చేసేందుకు బిడ్‌ను పెంచిన నేపథ్యంలో ఈ కౌంటర్‌ అమ్మకాల ఒత్తిడిలో పడినట్లు నిపుణులు పేర్కొన్నారు. విశ్లేషకులు కొంతమంది రేటింగ్‌ను డౌన్‌గ్రేడ్‌ చేయడంతో హీనెకెన్ 2 శాతం నీరసించింది. కాగా.. యూరోపియన్‌ యూనియన్‌ నుంచి బ్రిటన్‌ వైదొలగే(బ్రెక్సిట్‌) అంశంలో ఆరు వారాల్లోగా ఒప్పందం కుదిరే వీలున్నట్లు ఈయూ అధికారులు పేర్కొన్నారు. మరోవైపు రెండు నెలల్లోగా అమెరికాతో పాక్షిక వాణిజ్య ఒప్పందాలను ఈయూ కుదుర్చుకోనున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. దీంతో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు మార్కెట్‌ వర్గాలు వ్యాఖ్యానించాయి. 

 Most Popular