ఆల్బర్ట్‌ డేవిడ్‌, ట్రిటాన్‌ వాల్వ్స్‌ జూమ్‌

ఆల్బర్ట్‌ డేవిడ్‌, ట్రిటాన్‌ వాల్వ్స్‌ జూమ్‌

ఇటీవల ర్యాలీ బాటలో సాగుతున్న ఆల్బర్ట్‌ డేవిడ్‌ కౌంటర్‌ మరోసారి ఇన్వెస్టర్ల కొనుగోళ్లతో కళకళలాడుతుంటే.. విదేశాలలో వ్యాపార విస్తరణ వార్తలతో ట్రిటాన్‌ వాల్వ్స్‌ కౌంటర్‌ సైతం లాభాలతో సందడి చేస్తోంది. వివరాలు చూద్దాం..

ఆల్బర్ట్‌ డేవిడ్‌
గడిచిన నెల రోజులుగా భారీ ర్యాలీ చేస్తున్న దేశీ ఫార్మా సంస్థ ఆల్బర్ట్‌ డేవిడ్‌ కౌంటర్ మరోసారి దూకుడు చూపుతోంది. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 5.4 శాతం జంప్‌చేసి రూ. 795 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 830 వరకూ ఎగసింది. ఇది చరిత్రాత్మక గరిష్టంకాగా.. గత ఐదు వారాల్లో ఈ షేరు ఏకంగా 100 శాతం దూసుకెళ్లడం విశేషం! ఆగస్ట్‌ 7న ఈ షేరు రూ. 408 వద్ద ట్రేడయ్యింది. ఇదే కాలంలో సెన్సెక్స్‌ 0.6 శాతమే పెరిగింది.
ఫలితాలు భేష్
ఈ ఏడాది తొలి క్వార్టర్‌లో ఆల్బర్ట్‌ డేవిడ్‌ టర్న్‌అరౌండ్‌ ఫలితాలు ప్రకటించింది. క్యూ1(ఏప్రిల్‌-జూన్‌)లో రూ. 7.8 కోట్ల నికరలాభం ఆర్జించింది. గతేడాది క్యూ1లో రూ. 0.8 కోట్ల నికర నష్టం ప్రకటించింది. ఇదే విధంగా మొత్తం ఆదాయం సైతం 73 శాతం పెరిగి రూ. 94 కోట్లను తాకింది. దీంతో ఇటీవల ఈ కౌంటర్‌కు డిమాండ్‌ పెరిగినట్లు నిపుణులు పేర్కొంటున్నారు.

ట్రిటాన్‌ వాల్వ్స్‌ 
ఆసియా పసిఫిక్‌ ప్రాంతంలో బిజినెస్‌ విస్తరణకు వీలుగా విదేశీ అనుబంధ సంస్థ ఏర్పాటుకు బోర్డు అనుమతించినట్లు వెల్లడించడంతో ట్రిటాన్‌ వాల్వ్స్‌ కౌంటర్‌ జోరందుకుంది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ప్రస్తుతం బీఎస్‌ఈలో ఈ షేరు 5.5 శాతం జంప్‌చేసింది. రూ. 1552 వద్ద ట్రేడవుతోంది. కంపెనీలో ప్రమోటర్లకు 50.48 శాతం వాటా ఉంది. ఆసియా పసిఫిక్‌ ప్రాంతంలో బిజినెస్‌ విస్తరణకు వీలుగా హాంకాంగ్‌లో అనుబంధ సంస్థను ఏర్పాటు చేయనున్నట్లు ఆటోమోటివ్‌ టైర్లు, ట్యూబుల వాల్వ్స్‌, కోర్స్‌, తదితర యాక్సెసరీస్‌ తయారీ సంస్థ ట్రిటాన్‌ వాల్వ్స్‌ పేర్కొంది.Most Popular