సువెన్‌ లైఫ్‌ సైన్సెస్‌ షేరు దూకుడు

సువెన్‌ లైఫ్‌ సైన్సెస్‌ షేరు దూకుడు

గత కొద్ద రోజులుగా ర్యాలీ బాటలో సాగుతున్న బయోఫార్మా కంపెనీ సువెన్‌ లైఫ్‌ సైన్సెస్‌ కౌంటర్‌కు మరోసారి డిమాండ్‌ కనిపిస్తోంది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ఆటుపోట్ల మార్కెట్లోనూ ప్రస్తుతం ఈ షేరు 4 శాతం జంప్‌చేసి రూ. 332 వద్ద ట్రేడవుతోంది. ఎన్‌ఎస్‌ఈలో తొలుత  రూ. 338 వరకూ ఎగసింది. ఇది 52 వారాల గరిష్టంకాగా.. గత నెల రోజుల్లోనే ఈ స్టాక్‌ 30 శాతం ర్యాలీ చేయడం విశేషం! ఇక గడిచిన నాలుగు నెలల్లో ఈ షేరు 88 శాతం దూసుకెళ్లింది. ఇదే కాలంలో సెన్సెక్స్‌ 7 శాతమే పెరిగింది. నేటి ట్రేడింగ్‌లో లావాదేవీల పరిమాణం సైతం తొలి అర్థగంటలోనే 15 లక్షలను మించడం గమనించదగ్గ అంశం! 
పేటెంట్ల పుష్‌
కొత్తతరహా ఫార్మా ప్రొడక్టుల అభివృద్ధి, మార్కెటింగ్‌ తదితర కార్యక్రమాలు చేపట్టే సువెన్‌ లైఫ్‌ ఆగస్ట్‌ నెలలో చైనా, కెనడాసహా యూరేషియాల నుంచి ఒక్కో ప్రొడక్ట్‌ పేటెంట్‌ చొప్పున సాధించినట్లు వెల్లడించింది. నాడీసంబంధ వ్యాధుల చికిత్సకు సంబంధించిన న్యూకెమికల్‌ ఎంటైటీ(ఎన్‌సీఈ) ప్రాసెసింగ్‌కుగాను యూఎస్‌ఏ నుంచి సైతం పేటెంట్‌ లభించినట్లు తెలియజేసింది. కంపెనీ న్యూ డ్రగ్‌ డెలివరీ సిస్టమ్‌ విభాగంలో మాలిక్యూల్స్‌ అభివృద్ధిపై దృష్టిసారించే సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా మలాథియాన్‌ మాలిక్యూల్‌ను వాణిజ్యపరంగా అభివృద్ధి చేసింది. వార్షికంగా కంపెనీ 2-3 ఏఎనీడీలను అభివృద్ధి చేస్తోంది.Most Popular