కొచ్చర్‌కు త్వరలో సెబీ సమన్లు.. ఐసిఐసిఐపై ఎఫెక్ట్ ఉంటుందా ?

కొచ్చర్‌కు త్వరలో సెబీ సమన్లు.. ఐసిఐసిఐపై ఎఫెక్ట్ ఉంటుందా ?

ఏదో చేయబోతే మరేదో అయినట్టు... ICICI బ్యాంక్ సీఈఓ చందా కొచ్చర్ పరిస్థితి తయారైంది . బ్యాంక్‌ను అతి తక్కువ సమయంలోనే అత్యంత వృద్ధిలోకి తీసుకొచ్చిన చందా కొచ్చర్ ప్రతిష్ట క్రమంగా మసకబారుతూ వస్తోంది. తాజాగా సెబీ..  కొచ్చర్‌కు సమన్లు పంపే యోచనలో ఉన్నట్టు వార్తలు రావడంతో ఆమె ఇరకాటంలో పడ్డట్టైంది. ప్రస్తుతం సెలవు మీద ఉండాల్సిన దుస్థితికి వచ్చిన చందా కొచ్చర్ పై ఓ స్పెషల్ స్టోరీ ....

వీడియోకాన్ చిచ్చు .... 
వీడియోకాన్, వేణుగోపాల్ థూత్ ఈ రెండు పేర్లు వినబడితే చాలు... ICICI బ్యాంక్ వర్గాలు ఉలిక్కి పడుతున్నాయి ఇప్పుడు. తొలి నాళ్ళలో చందా కొచ్చర్ పగ్గాలు చేపట్టే నాటికే ఓ స్థాయిలో తనకంటూ ప్రత్యేకమైన స్థానంలో ఉంది ఐసిఐసిఐ. అప్పటికే కెవి కామత్ వంటి ప్రముఖుల ఆధ్వర్యంలో నడిచిన బ్యాంకు కాబట్టి.. వాళ్ల స్థాయికి ఆమె అందుకోగలదా అని అప్పట్లో అందరికీ అనుమానం వచ్చింది. అయితే మేనేజ్మెంట్ ఎగ్జిక్యూటివ్‌గా కెరీర్ ఆరంభించి.. ఎండి స్థాయికి ఎదిగిన కొచ్చర్ అనతి కాలంలోనే ఈ ప్రైవేటు బ్యాంకును మరింత పటిష్టం చేశారు. మరి అంతటి ఘన చరిత్ర గలిగిన చందా కొచ్చర్‌కు ఇప్పుడు సెబీ సమన్లు పంపే యోచనలో ఉండటమేంటి?  తాము ఇచ్చిన లోన్ పాపం తమకే చుట్టుకున్నట్టైంది ICICI బ్యాంక్ పరిస్థితి. ఇచ్చిన ఆ రుణం చివరికి చందా కొచ్చర్ ప్రతిష్టను గంగపాలు చేసేసింది. 
రెండు వేల కోట్ల రుణ కుంభకోణం .. 
ICICI బ్యాంకు .. 2012లో వేణుగోపాల్ ధూత్‌కు చెందిన  వీడియోకాన్ కంపెనికీ దాదాపు 2 వేల కోట్ల రూపాయిల రుణాన్ని మంజూరు చేసింది. ఇంతవరకూ బానే ఉంది. పెద్ద కంపెనీలకు పెద్ద మొత్తంలో రుణాలు ఇవ్వడం సాధారణమే. కానీ.. కాల క్రమంలో వీడియో కాన్ కంపెనీ ఆ రుణాన్ని చెల్లించలేమని చేతులెత్తేయడంతో ఇక్కడ ఏదో జరిగిందన్న అనుమానాలు తలెత్తాయి. బ్యాంక్ సీఈఓ చందా కొచ్చర్ భర్త దీపక్ కొచ్చర్ వేణుగోపాల్ ధూత్‌తో వ్యాపార లావాదేవీలు ఉండటం, బ్యాంకు నుండి కావాలనే చందా కొచ్చర్ వీడియోకాన్‌కు అంత పెద్ద మొత్తంలో రుణం లభించేలా చేసారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. వేణుగోపాల్ థూత్, చందా కొచ్చర్ భర్త దీపక్ కొచ్చర్ ను-పవర్ కంపెనీలో డైరెక్టర్లుగా కొనసాగుతున్నారు. ఉద్దేశ్యపూర్వకంగానే వేణుగోపాల్ థూత్ కు లబ్ధి చేకూర్చారనే చందా కొచ్చర్ దంపతులమీద ఆరోపణలు  వచ్చాయి.

 Image result for venugopal dhoot
క్విడ్ ప్రో కో .... 
 క్విడ్ ప్రో కో  అంటే నీకిది..నాకిది..అన్న పద్దతిలో ఈ లోన్ అక్రమాలు జరిగాయన్నది విజిల్ బ్లోయర్స్ ఆరోపణ. వివాదం ముదురుతుండటంతో చందా కొచ్చర్ దీర్ఘకాలిక సెలవుపై వెళ్లాల్సి వచ్చింది. కానీ.. కంపెనీ బోర్డు మాత్రం చందా కొచ్చర్‌పై పూర్తి నమ్మకముంచినట్టు ప్రకటించింది. ఇదొక్కటే చందా కొచ్చర్ కు కాస్త ఊరటనిచ్చే అంశం. 
 

సెబీ సమన్లు ?
ఇక ఈ ఉదంతంపై విచారణ జరుపుతున్న సెబీ త్వరలో చందా కొచ్చర్‌కు సమన్లు పంపనుంది. అవసరమైతే ఆమె వ్యక్తిగతంగా కూడా హాజరుకావాల్సి రావొచ్చు.  గోరు చుట్టుమీద రోకటి పోటులా , మిగతా దర్యాప్తు సంస్థలతో బాటు, సీబీఐ కూడా ఈ ICICI బ్యాంకు వ్యవహారంపై కేసు నమోదు చేసే యోచనలో ఉంది. సెబీ రెగ్యులేషన్లను పాటించలేదని తేలితే బ్యాంకు రూ.25 కోట్లు, కొచ్చర్ పై రూ.10 కోట్ల వరకూ పెనాల్టీ పడే అవకాశం ఉంది. 

అయితే ఐసిఐసిఐ బ్యాంకులో ప్రస్తుతం స్వతంత్ర దర్యాప్తు కొనసాగుతోంది. ఈ వ్యవహారంలో చందాకొచ్చర్ పాత్రను నిగ్గుతేల్చే పనిలో పడింది ఈ టీం. ఈ లోపు సెబీ దర్యాప్తులో ఏదైనా బయటకు వస్తే ఐసిఐసిఐ బ్యాంకుపై కొద్దో గొప్పో ప్రభావం తాత్కాలికంగా ఉండొచ్చని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఆమె ఎగ్జిట్‌ను మార్కెట్లు ఎప్పుడో ఫ్యాక్టర్ చేసేశాయని, కొత్తగా ఎలాంటి వార్త వచ్చినా పెద్దగా పట్టించుకోకపోవచ్చని అనిపిస్తోంది. ఏదైనా రియాక్షన్ వచ్చినా అది తాత్కాలికమేననేది నిపుణుల సలహా 

    Most Popular