మూడేళ్లలో పెట్టుబడి రెట్టింపు చేసుకునేందుకు దమానీ సలహాలు

మూడేళ్లలో పెట్టుబడి రెట్టింపు చేసుకునేందుకు దమానీ సలహాలు

స్టాక్ మార్కెట్ లో లాభాలు సంపాదించడం ఎలా?  అతి తక్కువ పెట్టుబడితో అధిక లాభార్జన ఎలా సాధ్యం? కొన్న స్టాక్ ఎంతవరకూ మనకు లాభాన్ని తెచ్చిపెడుతుంది? ఇవ్వన్నీ ఇన్వెస్టర్లను చికాకు పెట్టే ప్రశ్నలే. కానీ వీటికి అత్యంత సులభంగా పరిష్కారాలు చెబుతున్నారు... ప్రముఖ ఇన్వెస్టర్ , అవెన్యూ సూపర్ మార్ట్ స్వతంత్ర డైరెక్టర్ రమేష్ దమాని. విజయవంతమైన ఇన్వెస్టర్‌గా ఆయన స్టాక్ మార్కెట్లో మనందరికీ సుపరిచితులు.  
ఓ వార్తా సంస్థకిచ్చిన ఇంటర్వూలో ఆయన అనేక ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

కేవలం పదిలక్షల పెట్టుబడితో వంద కోట్లను ఎలా సంపాదించవచ్చో ఆయన వివరించారు. మన పెట్టుబడి మూడెళ్లలో రెట్టింపు అయ్యే స్టాక్స్ ను ఎంచుకుంటే... ముప్పై ఏళ్ళలో అది వెయ్యి రెట్లుగా మారుతుంది. అంటే పది లక్షల పెట్టుబడి గనుక మనం పెట్టినట్టైతే మూడేళ్లకు రెట్టింపు అయ్యే విధంగా ఉంటే 30 ఏళ్ళలో మన పెట్టుబడి 100 కోట్లకు చేరుతుందని దమాని లెక్క. 

'' స్టాక్ మార్కెట్ పూర్తిగా కుదేలైన 1992 సంవత్సరంలో పూర్తిగా స్టాక్ మార్కెట్‌ను అవపోశన పట్టాను. ప్రతీ ఒక్క చిన్న విషయాన్ని జాగ్రత్తగా చదివాను. బేర్ మార్కెట్లో పూర్తిగా పతనమైన (డౌన్ ట్రెండ్ లో ఉన్న) షేర్లను కొనవద్దు. అవి ఇంకా పతనమయ్యే ఛాన్స్‌లు ఎక్కువ. దీర్ఘకాలిక లక్ష్యాలను దృష్టిలో ఉంచుకుని భవిష్యత్తును ఊహించడం ప్రతీ ఇన్వెస్టర్ తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన విషయం. అప్పుడే విజయం తథ్యం '' - దమానీ

అందుకు ఉదాహరణగా తన అనుభవాన్ని చెప్తూ.. '' TCS లో విలీనం అయిన CMC లిమిటెడ్  షేర్లు 1992లో అతి తక్కువ ధరకే దొరికేవి. 10-15 రూపాయిల మధ్యే సదరు షేర్లు కోట్ అవుతుండేవి. ఇండియన్ రైల్వేస్ కు ఆన్‌లైన్‌లో రిజర్వేషన్ల ఆర్డర్స్ ఆ కంపెనీకి దక్కాయి. నేను ఆ కంపెనీ షేర్లను భారీగా కొన్నారు. ఒక్క ఏడాది లోనే  రైల్వే రిజర్వేషన్లు ఆన్‌లైన్ విధానం విజయవంతమయ్యాయి. ఆ షేర్లు దాదాపు 800 రెట్లు పెరిగాయి. దీన్ని బట్టి స్టాక్ పికింగ్ ఎలా ఉండాలో మీరు అర్థం చేసుకోవచ్చు ''. 
 

అమెరికా బిజినెస్ టైకూన్ వారెన్ బఫెట్ ప్రతీ సారీ చెప్పే విషయం ఇది. ఇతరులు ఆనాసక్తిగా ఉన్నపుడు మనం అత్యాశ పడొచ్చన్నమాటలను రమేష్ దమానీ ఇక్కడ ఉదహరిస్తారు. మార్కెట్ లో ఒక సక్సెస్‌ఫుల్ ఇన్వెస్టర్ కావాలంటే.. కాస్తంత తెగువ, ధైర్యం రెండూ ఉండాల్సిందే అంటారు దమాని. మార్కెట్ వేరే రకంగా ఉన్నా... స్పెక్యులేషన్ అనుకూలంగా లేక పోయినా.. నీవు నమ్మిన స్టాక్ మీద బలంగా విశ్వాసం ఉంచాలంటారు రమేష్ దమాని. స్టాక్ గుర్తించడంతో పాటు అందులో ఎక్కువ కాలం ఉండడం కూడా ఒక గొప్ప ఆర్ట్ అని అంటారు ఈ ఇన్వెస్ట్‌మెంట్ గురు. 


ప్రతీ బుల్ మార్కెట్ మనని మరింత ధృడంగా మారుస్తుందని దమానీ అంటాడు. "ఈ సారికి నష్టం తెచ్చిన అదే బుల్ మార్కెట్ వచ్చేసారి మనకు లాభాలను తెచ్చిపెట్టొచ్చు "  ఈ మాటలను బలంగా నమ్మిన వారు ఎవరూ నష్టపోలేదనేది దమానీ వాదన . ఆటుపోట్లను తట్టుకునేలా ఇన్వెస్టర్ నిలబడగలిగితే... మీ పెట్టుబడి ప్రతి మూడేళ్ళకోసారి రెట్టింపు కావడం అసాధ్యమేమీ కాదంటారు దమానీ. ఈ రెండు విషయాలు మీకర్ధమైతే మీరు ఆటలో ముందు భాగంలో ఉన్నట్టే.  రమేష్ దమానీ మాటలు అక్షర సత్యాలు కదూ.. మరి మీరూ పాటించండి.Most Popular