ఆలీబాబాకు జాక్ మా గుడ్ బై.. ! ఏం చేయబోతున్నారో తెలుసా ?

ఆలీబాబాకు జాక్ మా గుడ్ బై.. ! ఏం చేయబోతున్నారో తెలుసా ?

చైనా వ్యాపార దిగ్గజం ఆలీబాబా గ్రూప్ హోల్డింగ్స్ లిమిటెడ్  కో ఫౌండర్  బిలియనీర్  జాక్ మా తన పదవీ విరమణకు సమయం ఆసన్నమైందని తెలిపారు. 2019 సెప్టెంబర్ లో తాను పదవికి రాజీనామా చేయనున్నాని, తదనంతరం.. దాతృత్వ, విద్యారంగాల్లో పనిచేయాలనుకుంటున్నానని జాక్ మా తెలిపారు. ఇది ఒక శకానికి అంతం కాదు మరో శకానికి ఆరంభం మాత్రమే అని జాక్ పేర్కొన్నారు.
కాగా ఆలీబాబా కంపెనీలో డైరెక్టర్‌గా కొనసాగుతారని.. కంపెనీ కార్యనిర్వాహణకు అవసరమయ్యే సలహాలు , సంప్రదింపులు అందిస్తారని కంపెనీ వర్గాలు అంటున్నాయి. కాగా జాక్ మా తన రిటైర్ మెంట్ ప్రకటనపై పలు పత్రికల్లో వార్తలు రాకపోవడం , ప్రముఖ దిన పత్రిక న్యూస్ హెరాల్డ్ పై చైనాలో నిషేధం ఉండటంతో ఈ వార్త ఫోకస్ కాలేదు. బ్లూంబర్గ్ టీవీకి ఇచ్చిన ఇంటర్వూలో జాక్ మా తన రిటైర్‌మెంట్ ప్లాన్స్ చెప్పడంతో పదవి విరమణ అంశం రూఢీ అయింది.

బిల్ గేట్స్ అడుగుజాడల్లో...
రిటైర్ మెంట్ తరువాత మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ అడుగు జాడల్లో నడవనున్నానని జాక్ తెలిపారు. దాతృత్వంలో బిల్ గేట్స్ తనకు ఆదర్శమని.. తాను పలు దాతృత్వ సంస్థలతో కలిసి పనిచేసే యోచనలో ఉన్నట్టు మా తెలిపారు.బోధన రంగంలో తనకు అమితాసక్తి ఉందని.. త్వరలో ఆ రంగంలో ప్రవేశించాలనుకుంటున్నానని జాక్ మా తెలిపారు.

నిరుపేద కుటుంబంలో నుంచి...
చైనా ప్రావిన్స్ లోని హంగ్‌ఝూ ప్రాంతంలో ఓ పేద కుటుంబంలో జాక్ మా జన్మించారు. ఇంగ్లీష్‌ లిటరేచర్ లో గ్రాడ్యూయేషన్ తరువాత  ఓ యూనివర్శిటీలో అధ్యాపకుడిగా ఉన్నా.. ఇంటర్నెట్ వచ్చాక ఆ ఉద్యోగాన్ని వదిలేశాడు .చిన్న చిన్న వ్యాపారాలను పరిశీలించి... వారి వస్తువులను ఆన్ లైన్ లో అమ్మడానికి ఆలీబాబా సంస్ధను 1999లో స్థాపించాడు.  తొలి సారి కంప్యూటర్ కీబోర్డ్ ముట్టుకున్నపుడు ఇది ప్రపంచాన్ని, ముఖ్యంగా చైనాకు ఖచ్చితంగా మారుస్తుందని.. అనుకున్నానని ఓ వార్తా సంస్థకిచ్చిన ఇంటర్వూలో చెప్పారు జాక్ మా.
 డిజిటిల్ చైనా పురోభివృద్ధికి జాక్ మా స్థాపించిన ఆలీబాబా కంపెనీ  తొలి అడుగు కాగా, చైనా నుంచి పలు విజయవంతమైన, బిలియన్ డాలర్ల విలువ గల కంపెనీలు అవతరించడానికి కూడా అలీబాబా కంపెనీ పరోక్షంగా ప్రేరణగా నిలిచింది.

చైనా అత్యంత సంపన్నుడు

స్నేహితులు ఇచ్చిన 60 వేల డాలర్లతో మొదలెట్టిన ఈ కామర్స్ సంస్థ అలీబాబా నేడు సుమారు 420.8బిలియన్ డాలర్ల (సుమారు 30 లక్షల కోట్ల రూపాయిల ) సంస్థగా ఎదిగింది. అలీబాబా నుండి రిటైర్ అవుతున్న జాక్ మా చైనాలోనే అత్యంత సంపన్నుడిగా , 36.6 (సుమారు 2.59 లక్షల కోట్ల రూపాయిలు ) బిలియన్ డాలర్లకు అధిపతిగా ఫోర్బ్స్ ప్రకటించింది. సెప్టెంబర్ 10 న రిటైర్ అవుతున్న జాక్ మా వయసు 54 సంవత్సరాలు. చైనా యుద్ధ విద్య అయిన తైచీని ఇష్టపడే జాక్ తన సంస్థలోని ఉద్యోగులకు కూడా తైచీ పద్దతుల్లోని సహనం, పోరాడే తత్వం, ప్రతికూల పరిస్థితుల్లోనూ ధైర్యంగా నిలబడే లక్షణాలను నూరిపోశాడు. ఇదే అలిబాబా కంపెనీ ఓ వ్యాపార దిగ్గజంలా మారడానికి దోహదపడింది.