మార్కెట్లకు గణాంకాలు, విదేశీ అంశాలే దిక్కు

మార్కెట్లకు గణాంకాలు, విదేశీ అంశాలే దిక్కు

సోమవారం నుంచి మొదలుకానున్న ఈ వారం దేశీ స్టాక్‌ మార్కెట్లలో ట్రేడింగ్‌ నాలుగు రోజులకే పరిమితంకానుంది. గురువారం(13న) వినాయక చతుర్ధి సందర్భంగా బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలకు సెలవు. కాగా.. ఇకపై దేశీ స్టాక్‌ మార్కెట్లకు ఆర్థిక గణాంకాలు, ప్రపంచ సంకేతాలు దిక్సూచిగా నిలవనున్నాయి. జులై నెలకు పారిశ్రామికోత్పత్తి సూచీ(ఐఐపీ) వివరాలు బుధవారం(12న) వెలువడనున్నాయి. జూన్‌లో ఐఐపీ 7 శాతం జంప్‌ చేసింది. ఈ బాటలో ఆగస్ట్‌ నెలకు వినియోగ ధరల ద్రవ్యోల్బణ(సీపీఐ) గణాంకాలు సైతం ఇదే రోజు వెల్లడికానున్నాయి. జులైలో సీపీఐ 4.17 శాతం పెరిగింది. ఇక ఆగస్ట్‌ నెలకు టోకు ధరల ద్రవ్యోల్బణ(డబ్ల్యూపీఐ) గణాంకాలు శుక్రవారం(14న) విడుదలకానున్నాయి. జులైలో డబ్ల్యూపీఐ 5.09 శాతం ఎగసింది.

వాణిజ్య వివాదాలపై దృష్టి
ఇప్పటికే చైనాతో పలుమార్లు వాణిజ్య వివాదాలు చెలరేగిన నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్‌ విధానాలపై దృష్టి పెట్టనున్నారు. గత వారాంతానికి చైనా దిగుమతులపై టారిఫ్‌ల విధింపు అంశంపై ప్రజాభిప్రాయ సేకరణ ముగిసినట్లు అమెరికా ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఈ అంశంలో ట్రంప్‌ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవలసి ఉంది. ఇటీవల ప్రకటించిన 200 బిలియన్‌ డాలర్ల స్థానే 260 బిలియన్‌ డాలర్ల విలువైన చైనా దిగుమతులపై సుంకాల విధింపునకు అమెరికా ప్రభుత్వం యోచిస్తున్నట్లు ఆర్ధికవేత్తలు పేర్కొన్నారు. అయితే ఇందుకు తగిన విధంగా స్పందిస్తామంటూ  చైనా ప్రభుత్వం సైతం ఇప్పటికే స్పష్టం చేయడం గమనార్హం. మరోవైపు చైనా కరెన్సీ యువాన్‌ విలువను పీపుల్స్‌ బ్యాంక్‌ తగ్గించే అవకాశమున్నట్లు అంచనాలు వెలువడుతున్నాయి. వెరసి అమెరికా-చైనా మధ్య వాణిజ్య అంశాలు ఇకపై ప్రపంచ మార్కెట్లను ప్రభావితం చేయగలవని నిపుణులు అభిప్రాయపడ్డారు. ఈ ఆందోళనల నడుమ శుక్రవారం(7న) అమెరికా స్టాక్‌ మార్కెట్లు బలహీనంగా ముగిశాయి.

ప్రపంచ సంకేతాలు కీలకం
సోమవారం(10న) ఆగస్ట్‌ నెలకు చైనా సీపీఐ గణాంకాలు వెలువడనుండగా.. 13న యూరోపియన్‌ కేంద్ర బ్యాంకు(ఈసీబీ) పాలసీ సమీక్షను చేపట్టనుంది. ప్రస్తుతం ఈసీబీ వడ్డీ రేటు జీరో స్థాయిలో కొనసాగుతోంది. ఈ నెల నుంచి డిసెంబర్‌ వరకూ సహాయక ప్యాకేజీలను 15 బిలియన్‌ యూరోలకు పరిమితం చేయనున్నట్లు జులైలోనే ఈసీబీ పేర్కొంది. తద్వారా వీటికి మంగళంపాడనున్నట్లు తెలియజేసింది. కాగా.. 14న అమెరికా రిటైల్‌ సేల్స్‌ వివరాలు వెల్లడికానున్నాయి. ఈ అంశాలతోపాటు దేశ, విదేశీ ఫండ్స్‌ పెట్టుబడులు, ముడిచమురు ధరలు, డాలరుతో మారకంలో రూపాయి కదలికలు సైతం మార్కెట్లను ప్రభావితం చేయనున్నట్లు విశ్లేషకులు వివరించారు. గత వారం రూపాయి పతన బాటలో సాగుతూ చరిత్రలో తొలిసారి 72 మార్క్‌ దిగువకు చేరిన విషయం విదితమే.Most Popular