హడ్కో, అరబిందో ఫార్మా దూకుడు

హడ్కో, అరబిందో ఫార్మా దూకుడు

ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించడంతో ప్రభుత్వ రంగ సంస్థ హౌసింగ్‌ అండ్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌(హడ్కో) కౌంటర్‌ భారీ లాభాలతో కళకళలాడుతోంది. మరోవైపు యూఎస్‌ సంస్థ నుంచి ఆస్తులను కొనుగోలు చేయనున్న వార్తలతో హైదరాబాద్‌ ఫార్మా దిగ్గజం అరబిందో కౌంటర్‌ సైతం భారీ లాభాలతో  సందడి చేస్తోంది. వివరాలు చూద్దాం...

హడ్కో లిమిటెడ్‌
ప్రస్తుత ఏడాది క్యూ1(ఏప్రిల్‌-జూన్‌)లో హడ్కో లిమిటెడ్‌ నికర లాభం 105 శాతంపైగా దూసుకెళ్లి రూ. 333 కోట్లను అధిగమించింది. మొత్తం ఆదాయం సైతం 73 శాతంపైగా పుంజుకుని రూ. 1614 కోట్లను తాకింది. దీంతో ఈ కౌంటర్‌లో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు క్యూకట్టారు. ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో ఈ షేరు దాదపు 9 శాతం జంప్‌చేసింది. 61 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 63 వరకూ పెరిగింది. ఇటీవలే స్టాక్‌ ఎక్స్ఛేంజీలలో లిస్టయిన హడ్కోలో కేంద్ర ప్రభుత్వానికి 89.81 శాతం వాటా ఉంది. కాగా.. ఈ కౌంటర్లో ఇప్పటివరకూ దాదాపు 9 లక్షల షేర్లు చేతులు మారడం విశేషం! గత రెండు వారాల్లో సగటున 2 లక్షల షేర్లు ట్రేడయ్యాయి.

అరబిందో ఫార్మా
యూఎస్‌ దిగ్గజం శాండజ్‌ఇంక్‌ నుంచి చర్మవ్యాధుల చికిత్సకు వినియోగించే ఔషధ బిజినెస్‌ను కొనుగోలు చేయనున్నట్లు వెల్లడించడంతో అరబిందో ఫార్మా కౌంటర్‌ జోరందుకుంది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ఎన్‌ఎస్ఈలో తొలుత ఈ షేరు రూ. 740 వరకూ ఎగసింది.  ప్రస్తుతం 5.5 శాతం జంప్‌చేసి రూ. 736 వద్ద ట్రేడవుతోంది. నోవర్టిస్‌ విభాగం శాండజ్‌కు చెందిన ఓరల్‌ శాలిడ్స్‌ పోర్ట్‌ఫోలియోతోపాటు యూఎస్‌లోని వాణిజ్య, తయారీ మౌలిక సౌకర్యాలను సొంతం చేసుకోనున్నట్లు అరబిందో తాజాగా పేర్కొంది. డెట్‌ ఫ్రీ, క్యాష్‌ ఫ్రీ పద్ధతిలో కొనుగోలు చేస్తున్నట్లు తెలియజేసింది.Most Popular