వచ్చే వారం మార్కెట్లకు జీడీపీ పుష్‌?

వచ్చే వారం మార్కెట్లకు జీడీపీ పుష్‌?

వచ్చే వారం దేశీ స్టాక్‌ మార్కెట్లకు దేశ ఆర్థిక పురోగతి జోష్‌నివ్వనుంది. శుక్రవారం(ఆగస్ట్‌ 31)న మార్కెట్లు ముగిశాక కేంద్ర గణాంకాల శాఖ జీడీపీ వివరాలను ప్రకటించింది. ఈ కేలండర్‌ ఏడాది(2018) రెండో త్రైమాసికంలో దేశ జీడీపీ 8.2 శాతం ఎగసింది. గత రెండేళ్లలోనే ఇది అత్యధికంకాగా.. ఇంతక్రితం 2016 క్యూ2లో మాత్రమే ఇంతకంటే అధికంగా అంటే 9.3 శాతం పుంజుకుంది. ప్రధానంగా పరిశ్రమలు, వ్యవసాయ రంగాలు జోరందుకోవడం ద్వారా ఆర్థిక వ్యవస్థ పటిష్ట వృద్ధిని సాధించింది. మరోవైపు వినియోగం పుంజుకోవడం కూడా దీనికి సహకరించినట్లు ఆర్థికవేత్తలు పేర్కొంటున్నారు. పరిశ్రమల్లో పెట్టుబడులు, వ్యవసాయ రంగంలో విలువ జోడింపు వంటి అంశాలు జీడీపీ బలాన్నిచ్చినట్లు తెలియజేశారు. దీంతో సోమవారం దేశీ స్టాక్‌ మార్కెట్లు హుషారుగా ప్రారంభమయ్యే వీలున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఇతర అంశాలూ కీలకమే
వచ్చే వారం మొదట్లో మార్కెట్లకు జీడీపీ ప్రోత్సాహాన్నిచ్చినప్పటికీ తదుపరి పలు అంశాలు సెంటిమెంటును ప్రభావితం చేయగలవని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రధానంగా ప్రపంచ దేశాల మధ్య తలెత్తుతున్న వాణిజ్య విదాలు కీలకంగా నిలవనున్నట్లు పేర్కొన్నారు. కెనడాతో అమెరికా చేప్టటిన చర్చలు పెద్దగా పురోగతి లేకుండా ముగిసినట్లు వార్తలు వెలువడ్డాయి. అమెరికా, మెక్సికో, కెనడా 1994లో కుదుర్చుకున్న ఉత్తర అమెరికా స్వేచ్చా వాణిజ్య ఒప్పందాల(నాఫ్టా)ను ట్రంప్‌ ప్రభుత్వం వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో నాఫ్టాను పూర్తిస్థాయిలో సవరించేందుకు సిద్ధమైన అమెరికా ప్రభుత్వం మెక్సికోతో సరికొత్త వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకున్నప్పటికీ కెనడాతో చర్చలు అంత ఫలవంతంకాలేదని తెలుస్తోంది. మరోవైపు 200 బిలియన్‌ డాలర్ల విలువైన చైనా దిగుమతులపై ఈ నెల 5 నుంచీ టారిఫ్‌ల అమలుకు ట్రంప్‌ ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. దీంతో వచ్చే వారం కూడా వాణిజ్య వివాదాలపై ప్రపంచ స్టాక్‌ మార్కెట్లు దృష్టిపెట్టే అవకాశముంది.

ఆటో అమ్మకాలపై దృష్టి
దేశీయంగా ఆగస్ట్‌ నెల వాహన విక్రయ గణాంకాలు నేటి నుంచి వెలువడనున్నాయి. ఫలితంగా వచ్చే వారం మొదట్లో ఆటో రంగ కంపెనీలు వెలుగులో నిలిచే అవకాశమున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. కాగా.. జులై నెలకు 8 కీలక పరిశ్రమలతో కూడిన మౌలిక రంగం 6.6 శాతం వృద్ధిని సాధించింది. జూన్‌లో సాధించిన 7.6 శాతం పురోగతితో పోలిస్తే ఇది తక్కువేకావడం గమనార్హం! తయారీ రంగంలో 40 శాతం వాటాను కలిగిన మౌలిక వృద్ది తొలి నాలుగు నెలల(ఏప్రిల్‌-జులై) కాలంలో 5.8 శాతం పుంజుకుంది. ఆగస్ట్‌ 30వరకూ చూస్తే నైరుతీ రుతుపవనాల కారణంగా దేశవ్యాప్తంగా వర్షపాతం దీర్ఘకాలిక సగటుకంటే 6 శాతం తక్కువగా నమోదైనట్లు వాతావరణ శాఖ తాజాగా ప్రకటించింది. వీటితోపాటు విదేశీ ఇన్వెస్టర్లు, దేశీ ఫండ్స్‌ పెట్టుబడుల తీరు, ముడిచమురు ధరలు, రూపాయి కదలికలు వంటి అంశాలను సైతం ఇన్వెస్టర్లు గమనించే విషయం తెలిసిందే. కాగా.. గత వారాంతాన డాలరుతో మారకంలో రూపాయి చరిత్రాత్మక కనిష్టం 71ను తాకడం ప్రస్తావించదగ్గ అంశం! Most Popular