భారీ ట్రేడింగ్‌-యస్‌ బ్యాంక్ షేరు డౌన్‌

భారీ ట్రేడింగ్‌-యస్‌ బ్యాంక్ షేరు డౌన్‌

సీఈవో రాణాకపూర్‌ పదవిలో కొనసాగేందుకు ఆర్‌బీఐ ప్రస్తుతానికి అనుమతించినట్లు వార్తలు వెలువడినప్పటికీ ప్రయివేట్‌ రంగ సంస్థ యస్‌బ్యాంక్‌ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 5 శాతం పతనమై రూ. 344 దిగువన ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 350 వద్ద గరిష్టాన్నీ, రూ. 336 వద్ద కనిష్టాన్నీ తాకింది. కాగా.. తదుపరి నోటీస్‌ ఇచ్చేటంతవరకూ రాణా కపూర్‌ను సీఈవో, ఎండీగా కొనసాగేందుకు రిజర్వ్‌ బ్యాంక్‌ అనుమతించినట్లు యస్‌బ్యాంక్‌ తాజాగా ఎక్స్ఛేంజీలకు తెలియజేసింది. రాణా కపూర్‌ బ్యాంక్‌ వ్యవస్థాపక సీఈవోగా 2004 నుంచీ కొనసాగుతున్నారు. ఈ ఏడాది జూన్‌లో యస్‌ బ్యాంక్‌ వాటాదారులు మరో మూడేళ్లపాటు కపూర్‌ పదవిలో కొనసాగేందుకు అనుమతించారు. కాగా.. ఇందుకు ఆర్‌బీఐ నుంచి అనుమతి రావలసి ఉన్నదని వార్తలు వెలువడ్డాయి.
నేలచూపులో
రాణా కపూర్‌ తిరిగి సీఈవోగా కొనసాగేందుకు రిజర్వ్‌ బ్యాంక్‌  నుంచి తప్పనిసరి అనుమతి పొందవలసి ఉంటుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. కొద్ది రోజులుగా ఈ అంశం పెండింగ్‌లో ఉండటంతో యస్‌ బ్యాంక్‌ కౌంటర్‌ బలహీనంగా కదులుతున్నట్లు తెలియజేశారు. దీంతో గత 8 ట్రేడింగ్‌ సెషన్లలో యస్‌ బ్యాంక్‌ షేరు 14 శాతం నష్టపోయింది. కాగా.. నేటి ట్రేడింగ్‌ ప్రారంభమైన అర్ధగంటలోనే రెండు ఎక్స్చేంజీలలోనూ కలిపి 24.53 మిలియన్‌ షేర్లు చేతులు మారడం గమనార్హం. గత రెండు వారాల్లో సగటున 18 మిలియన్‌ షేర్లు ట్రేడవుతున్నట్లు తెలుస్తోంది.



Most Popular