- ఇన్వెస్టర్ నెట్‌వర్త్ ఎవరు, ఎలా నిర్ణయిస్తారంటే..?
- మీ నెట్‌వర్త్ ఎంతో తెలుసుకుంటారా?
మార్కెట్ రెగ్యులేటర్ సెబీ తాజాగా ఇన్వెస్టర్‌కు ఇచ్చే ఎక్స్పోజర్ విషయంలో, అతని నెట్‌వర్త్‌కు లింక్ చేయాలంటూ ప్రతిపాదన చేసింది. ఈక్విటీ, డెరివేటివ్ మార్కెట్ ఎక్స్పోజర్ను నెట్‌వర్త్‌కు అనుసంధానం చేయాలనే ప్రతిపాదనకు అడ్డంకులు కనిపిస్తున్నాయి. క్లయింట్ నెట్‌వర్త్‌ను నిర్ణయించే పని తాము చేపట్టబోని బ్రోకింగ్ కంపెనీలు అంటున్నాయి.
ఇన్వెస్టర్ నెట్‌వర్త్‌ను నిర్ణయించే బాధ్యతను... ఛార్టర్డ్ అకౌంటెంట్స్ కానీ లేదా ఇన్వెస్టర్ స్వయంగా అందించే ధృవపత్రం ఆధారంగా కానీ చేయాలని, కొన్ని రోజుల క్రితం జరిగిన ఓ మీటింగ్‌లో, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియాకు కొంతమంది బ్రోకర్లు తెలియచేశారు.
కానీ సెబీ మాత్రం ఈ బాధ్యత సెబీ చేపట్టాలనే అంటోంది. ఆదాయ గణాంకాలను కూడా పరిశీలించాలని సెబీ చెబుతోంది.
ఏమిటీ నెట్‌వర్త్?
2017, జూలై 12న "భారత దేశంలో ఈక్విటీ డెరివేటివ్స్ మార్కెట్ పెరుగుల మరియు అభివృద్ధి" అనే అంశంపై సెబీ ఒక డిస్కషన్ పేపర్‌ను జారీ చేసింది.
ఇందులో డెరివేటివ్ సెగ్మెంట్లో ట్రేడింగ్ చేస్తున్న అనేక మంది వ్యక్తిగత మదుపరులకు "డెరివేటివ్ సాధనాలలో ఉండే రిస్క్ ను భరించేందుకు తగినంత ఆర్థిక శక్తి" ఉందా లేదా అనే అంశంపై పరిశీలించాలని ప్రతిపాదించారు.
ఈక్విటీ మార్కెట్ టర్నోవర్‌కు 15 రెట్లు డెరివేటివ్ సెగ్మెంట్లో ట్రేడింగ్ జరుగుతోంది. ఇది అధిక మొత్తంలో స్పెక్యులేషన్‌ను సూచిస్తోంది. దీంతోనే రిటైల్ ఇన్వెస్టర్లకు బ్యాడ్ న్యూస్ వినిపించేందుకు సెబీ సిద్ధం అయిపోతోంది.
పొజిషన్స్‌పై పరిమితులు
త్వరలో రిటైల్ ఇన్వెస్టర్ల ట్రేడింగ్ పొజిషన్స్‌పై పరిమితులు విధించే దిశగా చర్యలను సెబీ చేపట్టనుంది. ఇందుకు ఆయా వ్యక్తుల నెట్‌వర్త్‌ను ఆధారం చేసుకోనున్నారు.
రిటైల్ ఇన్వెస్టర్లు ఇప్పుడు తమ నెట్‌వర్త్‌కు సంబంధించి ఒక ధృవపత్రాన్ని సమర్పించాల్సి ఉంటుంది. దీన్ని ఎవరైనా ఛార్టర్డ్ అకౌంటెంట్ నుంచి తీసుకుని.. తమ స్టాక్ బ్రోకర్‌కు సమర్పించాలి. దీని ఆధారంగానే ట్రేడింగ్ పరిమితులను నిర్ణయించాలన్నది సెబీ ఉద్దేశ్యం.
నెట్‌వర్త్ అంటే!
నెట్‌వర్త్ అంటే, ఆయా వ్యక్తుల ఆర్థిక మరియు ఆర్థికేతర ఆస్తుల విలువ నుంచి వారి అప్పులను తీసివేయగా మిగిలిన మొత్తం.
ఈక్విటీ మార్కెట్లో తరచుగా మార్జిన్ ట్రేడింగ్ చేయడం కనిపిస్తుంది. అంటే వ్యక్తులు తమ బ్రోకర్ నుంచి అప్పు తీసుకుని, స్టాక్స్‌లో ట్రేడ్ చేస్తుంటారు.
అలాగే డెరివేటివ్స్ మార్కెట్లో కూడా పొజిషన్స్ తీసుకుంటూ ఉంటారు. దీని అర్ధం ఏంటంటే, అంత పెద్ద మొత్తం పొజిషన్‌ను అవసరమైతే తీసుకోవాలనే ఆలోచన వారికి ఉండాలి. అంటే, సెటిల్మెంట్ సమయంలో షేర్ల డెలివరీ తీసుకునేందుకు సన్నద్ధం కావాలన్న మాట. కానీ ఈ పొజిషన్స్‌ను ట్రేడింగ్ కోసమే ఉపయోగిస్తుంటారు.
ఈ తరహా ట్రేడింగ్‌ను నిరోధించేందుకే సెబీ ఈ నెట్‌వర్త్ ప్రకారం మార్జిన్ లిమిట్ అనే ఆలోచన చేయాల్సి వచ్చింది.
"ఈ నిబంధన ఒక రకంగా రిటైల్ ఇన్వెస్టర్లకు మేలు చేసేదే. వారి నిజమైన ఆర్థిక స్థితి కంటే చాలా పెద్ద మొత్తంలో తీసుకునే ఈ రిస్కీ పొజిషన్స్... వారి అంచనాలు తేడా వచ్చిన సమయంలో భారీ నష్టాన్ని కలిగిస్తాయి" అని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, అసిస్టెంట్ ప్రొఫెసర్ రామభద్రన్ తిరుమలై చెబుతున్నారు.
రిటైల్ ఇన్వెస్టర్ల యాంగిల్
చాలా మంది రిటైల్ ఇన్వెస్టర్లు తమ నెట్‌వర్త్ సర్టిఫికేట్‌ను తెచ్చుకునే ప్రయత్నం కూడా చేయబోరనే అంచనాలు ఉన్నాయి.
అసలు సెబీ వంటి మార్కెట్ రెగ్యులేటర్‌కు, తమ నెట్‌వర్త్ తెలిపేందుకు ముందుకు రాకపోవచ్చు కూడా. అంటే, ఈ తరహా నిబంధనలను పక్కాగా అమలు చేస్తే, అపుడు నిధులు స్పెక్యులేటివ్ అయిన డెరివేటివ్స్‌లోకి కాకుండా, మ్యూచువల్ ఫండ్స్‌లోకి మారే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
అసలు సాధ్యమేనా?
“రిటైల్ స్థాయిలో ఇలాంటి మైక్రో మేనేజ్మెంట్ సాధ్యం కాదు. అసలు ఈ ఆలోచనే అసమంజసం. చివరకు వచ్చేసరికి వీటిని అమలు చేసేందుకు బదులుగా, చివరకు సెబీ కంప్లయెన్స్ కాస్ట్‌ను పెంచి, మిగిలిన అంశాలను పక్కన పెట్టేయవచ్చు,”అని ఇండస్ట్రీ నిపుణులు చెబుతున్నారు.