70.15 వద్ద రుపీ ముగింపు!

70.15 వద్ద రుపీ ముగింపు!

వారాంతాన రూపాయి చరిత్రాత్మక కనిష్టం వద్ద ముగిసింది. డాలరుతో మారకంలో 26 పైసలు(0.37 శాతం) బలహీనపడి 70.15 వద్ద నిలిచింది. శుక్రవారం ఇంటర్‌బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్లో ఒక దశలో రూపాయి 51 పైసలు పతనమైంది. 70.40 వరకూ జారింది. ఇది ఇంట్రాడేలో లైఫ్‌ టైమ్‌ 'లో'కాగా.. టర్కీ కరెన్సీ లైరా కుప్పకూలడం, దేశీయంగా జులైలో వాణిజ్య లోటు ఐదేళ్ల గరిష్టానికి చేరడం వంటి ప్రతికూలతలతో రూపాయి గత వారం చివర్లో సరికొత్త కనిష్టాలను తాకుతూ వచ్చిన సంగతి తెలిసిందే. వెరసి ఈ ఏడాది ఇప్పటివరకూ రూపాయి మారకపు విలువ 10 శాతం దిగజారింది. 
70 దిగువకు
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా బుధవారం బులియన్‌ మార్కెట్‌కు సెలవుకాగా.. ఆర్‌బీఐ జోక్యం తదితర అంశాలతో మంగళవారం(14న) చివరికి రూపాయి స్వల్పంగా 2 పైసలు బలపడింది. ఇంటర్‌బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్లో డాలరుతో మారకంలో 69.89 వద్ద నిలిచింది. కాగా.. మంగళవారం చరిత్రలో తొలిసారిగా రూపాయి 70 మార్క్‌ దిగువకు చేరిన విషయం విదితమే. తిరిగి గురు, శుక్రవారాల్లో రూపాయి తిరోగమన పథంలో సాగింది.
డాలర్‌ దెబ్బ!
టర్కీ ఆర్థిక సంక్షోభంలో చిక్కుకోవడంతో ప్రపంచవ్యాప్తంగా వర్ధమాన దేశాల కరెన్సీలు దెబ్బతింటూ వస్తున్నాయి. ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు గత వారం 13 నెలల గరిష్టం 96.75కు చేరింది. బుధవారం ఒక దశలో 96.98 వరకూ ఎగసింది. ప్రెసిడెంట్‌ టయ్యిప్‌ ఎర్డోగన్‌ ఆర్థిక వ్యవస్థపై నియంత్రణలు పెంచడం, అమెరికాతో దౌత్యపరమైన వ్యతిరేకతలు ఏర్పడటం వంటి పలు ప్రతికూల అంశాల కారణంగా టర్కీ ఆర్థిక సంక్షోభంవైపు అడుగులేసింది. దీంతో యూరోసహా పలు కరెన్సీలు దెబ్బతిన్నాయి. ఇప్పటికే టర్కీ కరెన్సీ ఈ ఏడాది 50 శాతంపైగా కుప్పకూలి ఒక దశలో 7.5 స్థాయికి చేరింది.  Most Popular