గత వారం నిఫ్టీ రికార్డ్‌-సన్‌ ఫార్మా షైన్‌!

గత వారం నిఫ్టీ రికార్డ్‌-సన్‌ ఫార్మా షైన్‌!

గడిచిన వారం దేశీ స్టాక్‌ మార్కెట్లు భారీ హెచ్చుతగ్గుల మధ్య కదిలాయి. నాలుగు రోజులకే పరిమితమైన ట్రేడింగ్‌లో మార్కెట్లు స్వల్ప లాభాలతో ముగిశాయి. వెరసి వరుసగా నాలుగో వారం లాభాలతో నిలిచాయి. ప్రధానంగా నిఫ్టీ సరికొత్త రికార్డ్‌ గరిష్టం వద్ద నిలవడం విశేషం! శుక్రవారం(17)తో ముగిసిన వారం సెన్సెక్స్‌ నికరంగా 79 పాయింట్లు(0.2 శాతం) పుంజుకుని 37,948 వద్ద నిలిచింది. నిఫ్టీ సైతం 41 పాయింట్లు(0.36 శాతం) బలపడి 11,471 వద్ద స్థిరపడింది. ఇది చరిత్రాత్మక గరిష్టంకాగా.. చిన్న షేర్లు సైతం మార్కెట్ల బాటలో లాభపడ్డాయి. గత వారం బీఎస్ఈలో మిడ్‌ క్యాప్‌, స్మాల్‌ క్యాప్‌ ఇండెక్సులు 0.5 శాతం స్థాయిలో ఎగశాయి. బుధవారం స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మార్కెట్లు పనిచేయలేదు.
బ్లూచిప్స్‌ తీరిదీ
సెన్సెక్స్‌ దిగ్గజాలలో సన్‌ ఫార్మా దాదాపు 13 శాతం దూసుకెళ్లింది. ఈ ఏడాది క్యూ1లో సాధించిన ఫలితాలు ఇన్వెస్టర్లను ఆకట్టుకోవడం దీనికి కారణంకాగా... స్టెరిలైట్‌ ప్లాంటుకి సంబంధించి మద్రాస్‌ హైకోర్టు నుంచి నోటీస్‌ జారీ అయ్యిందన్న వార్తల నేపథ్యంలో వేదాంతా షేరు 4 శాతం పతనమైంది. పటిష్ట ఫలితాల నేపథ్యంలో కోల్‌ ఇండియా 2 శాతం బలపడింది. మిగిలిన బ్లూచిప్స్‌లో కొటక్‌ మహీంద్రా, ఎల్‌అండ్‌టీ 2 శాతం చొప్పున డీలాపడ్డాయి. జులైలో వాణిజ్య లోటు 57 శాతం పెరిగి  ఐదేళ్ల గరిష్టం 18 బిలియన్‌ డాలర్లను తాకింది. దీంతో డాలరుతో మారకంలో రూపాయి బలహీనపడింది. టర్కీ కరెన్సీ లైరా పతనం ప్రధానంగా దెబ్బకొట్టడంతో చరిత్రాత్మక కనిష్టం 70.3ను తాకింది.Most Popular