విదేశీ సంకేతాలపై మార్కెట్ల చూపు!

విదేశీ సంకేతాలపై మార్కెట్ల చూపు!

వచ్చే వారం దేశీ స్టాక్‌ మార్కెట్లు విదేశీ సంకేతాలపై ఆధారపడి కదిలే అవకాశముంది. ఈ వారం ట్రేడింగ్‌ నాలుగు రోజులకే పరిమితంకానుంది. బక్రీద్‌ సందర్భంగా బుధవారం(22న) స్టాక్ మార్కెట్లు పనిచేయవు. కాగా.. ఇటీవల ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు రేకెత్తిస్తున్న వాణిజ్య వివాదాలకు చెక్‌ పెట్టేబాటలో చైనీస్‌ ప్రతినిధుల బృందం అమెరికన్‌ డెలిగేట్స్‌తో సమావేశంకానుంది. మంగళ, బుధవారాల్లో అమెరికా, చైనా ప్రతినిధుల మధ్య చర్చలు జరగనున్నాయి. ఈ చర్చల పురోగతి ప్రపంచ స్టాక్‌ మార్కెట్లను ప్రభావితం చేసే అవకాశమున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. 

వర్షపాతానికీ ప్రాధాన్యం
గత వారాంతాన వాతావరణ శాఖ(ఐఎండీ) నైరుతి రుతుపవన గమనంపై తాజా విశ్లేషణ ప్రకటించింది. జూన్‌ 1 మొదలు ఆగస్ట్‌ 15 వరకూ దేశవ్యాప్తంగా వర్షపాతం దీర్ఘకాలిక సగటుకంటే 9 శాతం తక్కువగా నమోదైనట్లు పేర్కొంది. జూన్‌-సెప్టెంబర్‌ కాలంలో కురిసే వర్షాలు దేశ వ్యవసాయ రంగానికి కీలకమన్న సంగతి తెలిసిందే. ఇకపై రుతుపవనాల విస్తరణ సైతం సెంటిమెంటును ప్రభావితం చేయగలదని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

ఫెడ్‌ మినిట్స్‌పై దృష్టి
జులై చివరిలో చేపట్టిన పాలసీ సమీక్ష విశేషాల(మినిట్స్‌)ను అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ 22న విడుదల చేయనుంది. అమెరికా ఆర్థిక వ్యవస్థ పురోగతి, ధరల పెరుగుదల వంటి అంశాలతోపాటు.. చైనాతో ఏర్పడ్డ వాణిజ్య వివాదాల ప్రభావంపైనా ఫెడ్‌ కమిటీ అంచనాలు మినిట్స్‌ ద్వారా వెల్లడికానున్నాయి. అంతేకాకుండా ఇకపై ఫెడ్‌ అనుసరించనున్న పాలసీ నిర్ణయాలకు సంబంధించిన సంకేతాలు సైతం వెలువడనున్నాయి. దీంతో ఫెడ్‌ మినిట్స్‌కు ప్రాధాన్యమున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఫెడ్‌ ఫండ్స్ రేట్లు 1.75-2 శాతం స్థాయిలో అమలవుతున్నాయి.

ఇతర అంశాలేవిటంటే?
ద్రవ్యలోటు, మితిమీరిన ప్రభుత్వ నియంత్రణలు, అమెరికా టారిఫ్‌లు వంటి సమస్యలతో ఇటీవల టర్కీ కరెన్సీ లైరా కుప్పకూలింది. దీంతో ఆ దేశ ఆర్థిక వ్యవస్థ సంక్షోభంవైపు అడుగులేస్తోంది. దీంతో డాలరు బలపడగా.. వర్ధమాన కరెన్సీలు పతనమయ్యాయి. ఇది రూపాయినీ దెబ్బకొడుతోంది. జులైలో దేశ వాణిజ్య లోటు 5 ఏళ్ల గరిష్టానికి చేరడం కూడా రూపాయిని బలహీనపరుస్తున్నట్లు ఆర్థికవేత్తలు చెబుతున్నారు. ఇవికాకుండా ముడిచమురు ధరలు, విదేశీ ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు), దేశీ ఫండ్స్‌(డీఐఐలు) పెట్టుబడులు తదితర అంశాలను సైతం ఇన్వెస్టర్లు నిశితంగా పరిశీలిస్తారని విశ్లేషకులు తెలియజేశారు.  Most Popular