మార్కెట్ల ర్యాలీ- 38,000 చేరువకు సెన్సెక్స్‌!

మార్కెట్ల ర్యాలీ- 38,000 చేరువకు సెన్సెక్స్‌!

కొంత కాలంగా అంతర్జాతీయ స్థాయిలో ఆందోళనలకు కారణమైన అమెరికా, చైనా మధ్య వాణిజ్య వివాదాలు పరిష్కారమయ్యే సూచనలు కనిపించడంతో ప్రపంచవ్యాప్తంగా స్టాక్‌ మార్కెట్లు జోరందుకున్నాయి. దేశీయంగానూ ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో సెన్సెక్స్‌ మరోసారి 38,000 పాయింట్ల మైలురాయికి సమీపంలో ముగిసింది. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు కలిగిన అమెరికా, చైనాకు చెందిన ప్రతినిధులు వచ్చే వారం చర్చలు చేపట్టనున్నట్లు వెలువడ్డ వార్తలు ఇన్వెస్టర్లకు హుషారునిచ్చాయి. దీంతో 284 పాయింట్లు ఎగసిన సెన్సెక్స్ 37,948 వద్ద నిలవగా.. నిఫ్టీ 86 పాయింట్లు జంప్‌చేసి 11,471 వద్ద స్థిరపడింది.
పీఎస్‌యూ బ్యాంక్స్‌ హవా
ఎన్‌ఎస్‌ఈలో అన్ని రంగాలూ లాభపడగా పీఎస్‌యూ బ్యాంక్స్‌ 3 శాతం జంప్‌చేసింది. ఈ బాటలో ఎఫ్‌ఎంసీజీ, మెటల్‌ రంగాలు దాదాపు 2 శాతం చొప్పున ఎగశాయి. నిఫ్టీ దిగ్గజాలలో గ్రాసిమ్‌, యస్‌బ్యాంక్‌, వేదాంతా, లుపిన్‌, ఎస్‌బీఐ, టాటా మోటార్స్‌, టెక్‌ మహీంద్రా, వేదాంతా, హెచ్‌యూఎల్‌, టాటా స్టీల్‌, టైటన్‌ 4.3-2.3 శాతం మధ్య లాభపడ్డాయి. కేవలం గెయిల్‌, ఐషర్, హీరోమోటో, ఓఎన్‌జీసీ, ఎయిర్‌టెల్‌, మారుతీ, హెచ్‌డీఎఫ్‌సీ, కోల్‌ ఇండియా 1.4-0.5 శాతం మధ్య నీరసించాయి. 
చిన్న షేర్లు జోరు
మార్కెట్లు ఊపందుకోవడంతో చిన్న షేర్లకూ డిమాండ్‌ పెరిగింది. బీఎస్ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ ఇండెక్సులు 1 శాతం స్థాయిలో పుంజుకున్నాయి. ట్రేడైన మొత్తం షేర్లలో 1629 లాభపడగా.. 1081 నష్టాలతో ముగిశాయి.
ఎఫ్‌పీఐల అమ్మకాలు
నగదు విభాగంలో గురువారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 825 కోట్ల పెట్టుబడులను వెనక్కితీసుకోగా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 134 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేశాయి. కాగా.. మంగళవారం సైతం ఎఫ్‌పీఐలు దాదాపు రూ. 379 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించగా.. దేశీ ఫండ్స్‌ రూ. 391 కోట్లకుపైగా ఇన్వెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. బుధవారం ఇండిపెండెన్స్‌ డే సందర్భంగా స్టాక్‌, కమోడిటీ, బులియన్‌, ఫారెక్స్‌ మార్కెట్లు పనిచేయలేదు.Most Popular