ఫలితాల జోరు- పేపర్‌ స్టాక్స్‌ హవా!

ఫలితాల జోరు- పేపర్‌ స్టాక్స్‌ హవా!

గత కొద్ది రోజులుగా రేసు గుర్రాల్లా పరిగెడుతున్న పేపర్‌ స్టాక్స్‌ మరోసారి ర్యాలీ బాటపట్టాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడుతుండటంతో పలు పేపర్‌ కౌంటర్లు లాభాలతో కళకళలాడుతున్నాయి. ప్రస్తుతం బీఎస్ఈలో జేకే పేపర్‌ దాదాపు 8 శాతం దూసుకెళ్లి రూ. 184ను అధిగమించగా.. శ్రేయాన్‌ ఇండస్ట్రీస్‌ 10 శాతం జంప్‌చేసి రూ. 166ను దాటింది. ఇంట్రాడేలో రూ. 174 వరకూ ఎగసింది. ఈ బాటటో ఎన్‌ఆర్‌ అగర్వాల్‌ ఇండస్ట్రీస్‌ 7.3 శాతం జంప్‌చేసి రూ. 507కు చేరగా... స్టార్‌ పేపర్‌ మిల్స్‌ 7.3 శాతం పెరిగి రూ. 189 వద్ద ట్రేడవుతోంది. ఇక రుచిరా పేపర్స్‌ 5.4 శాతం పురోగమించి రూ. 147ను తాకగా.. వెస్ట్‌కోస్ట్‌ పేపర్‌ 3 శాతంపైగా లాభపడి రూ. 341 వద్ద కదులుతోంది. తొలుత ఒక దశలో రూ. 349ను సైతం అధిగమించింది. ఇతర స్టాక్స్‌లో రామా పేపర్‌ 5 శాతం పుంజుకోగా.. శేషసాయి పేపర్‌, ఇమామీ పేపర్‌, ఇంటర్నేషనల్‌ పేపర్‌ తదితరాలు 2-1 శాతం మధ్య బలపడ్డాయి.  
నెల రోజులుగా ర్యాలీ
గత నెల రోజుల్లో  జేకే పేపర్‌, ఇంటర్నేషనల్‌ పేపర్‌, రుచీరా పేపర్స్‌, సంగల్‌ పేపర్స్‌, నాథ్‌ పల్ప్‌, వెస్ట్‌ కోస్ట్‌, ఇమామీ పేపర్‌, రామా పేపర్‌, శేషసాయి పేపర్‌, శ్రేయన్స్‌ ఇండస్ట్రీస్, టీఎన్‌ న్యూస్‌ప్రింట్‌, ఎన్‌ఆర్‌ అగర్వాల్‌, రామా పల్ప్‌ తదితరాలు 74-25 శాతం మధ్య పురోగమించాయి.
క్యూ1 గుడ్‌.. క్యూ2..?
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం(ఏప్రిల్‌-జూన్‌)లో దేశీయంగా పలు పేపర్‌ కంపెనీలు ఆకర్షణీయ ఫలితాలను సాధించాయి. మొత్తం 54 కంపెనీలు క్యూ1 ఫలితాలు ప్రకటించాయి. సంయుక్తంగా ఇవి రూ. 224 కోట్ల నికర లాభం ఆర్జించాయి. గతేడాది(2017-18) క్యూ1లో రూ. 346 కోట్లమేర నికర నష్టాలు నమోదుకావడం గమనార్హం! ఇక నికర అమ్మకాలు సైతం 19 శాతం పుంజుకుని రూ. 6749 కోట్లను తాకాయి. ముడిసరుకుల ధరలు తగ్గడం, డిమాండ్‌ పెరగడం, ధరలు పుంజుకోవడం వంటి సానుకూల అంశాలు పేపర్‌ కంపెనీల లాభదాయకతను మెరుగుపరచినట్లు పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. కాగా.. రెండో క్వార్టర్‌(జులై-సెప్టెంబర్‌)లోనూ ఇదే రీతిలో పేపర్‌ కంపెనీలు మెరుగైన ఫలితాలు ప్రకటించే అవకాశమున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. వెరసి పేపర్‌ స్టాక్స్‌కు డిమాండ్‌ పెరగుతున్నట్లు చెబుతున్నారు. Most Popular