లెమన్‌ ట్రీ, కాస్మో ఫిల్మ్స్‌ ప్లస్‌!

లెమన్‌ ట్రీ, కాస్మో ఫిల్మ్స్‌ ప్లస్‌!

ఆంధ్రప్రదేశ్‌లో హోటల్‌ ఏర్పాటుకు లైసెన్సింగ్‌ ఒప్పందాన్ని కుదుర్చకున్నట్లు వెల్లడించడంతో ఆతిథ్య రంగ సంస్థ లెమన్‌ ట్రీ హోటల్స్‌ కౌంటర్‌ లాభపడగా.. మెటల్‌ బాండ్‌ పటిష్టత కలిగిన కొత్త తరహా ప్యాకింగ్‌ ప్రొడక్టును మార్కెట్లో విడుదల చేసినట్లు పేర్కొనడంతో ప్యాకేజింగ్‌ సంస్థ కాస్మో ఫిల్మ్స్‌ కౌంటర్‌ బలపడింది.

లెమన్‌ ట్రీ హోటల్స్‌:
ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో 90 గదులతో హోటల్‌ ఏర్పాటుకు లైసెన్స్‌ ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు లెమన్‌ ట్రీ హోటల్స్‌ పేర్కొంది. ఏపీ వాణిజ్య రాజధాని విజయవాడలో కంపెనీ ఏర్పాటు చేస్తున్న రెండో హోటల్‌ ఇదికావడం గమనార్హం! కాగా ప్రస్తుతం కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా రెడ్‌ ఫాక్స్‌ హోటల్‌ బ్రాండుతో  హోటల్‌ను నిర్వహించనున్నట్లు తెలియజేసింది. 2020 జూన్‌కల్లా ఈ హోటల్‌ను ప్రారంభించే అవకాశమున్నట్లు తెలియజేసింది. కంపెనీకి చెందిన హోటల్‌ మేనేజ్‌మెంట్‌ విభాగం కార్నేషన్‌ హోటల్‌ ప్రయివేట్ లిమిటెడ్‌ ద్వారా రెడ్‌ ఫాక్స్‌ నిర్వహణను చేపట్టనున్నట్లు తెలియజేసింది. ఈ నేపథ్యంలో లెమన్‌ ట్రీ హోటల్స్‌ షేరు ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం 2 శాతం లాభంతో రూ. 80 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 80 వద్ద గరిష్టాన్నీ, రూ. 78.50 వద్ద కనిష్టాన్నీ తాకింది. కంపెనీలో ప్రమోటర్లకు 31 శాతంపైగా వాటా ఉంది.

కాస్మో ఫిల్మ్స్‌:
క్యాస్ట్‌ పాలీప్రొపిలీన్‌ మెటలైజ్‌డ్‌ ఫిల్మ్‌ను మార్కెట్లో ప్రవేశపెట్టినట్లు వెల్లడించడంతో కాస్మో ఫిల్మ్స్‌ కౌంటర్‌ పుంజుకుంది. ఈ ఫిల్మ్‌లు హై మెటల్‌ బాండ్‌ పటిష్టతను కలిగి ఉంటాయని కంపెనీ పేర్కొంది. తద్వారా మల్టీలేయర్‌ ల్యామినేట్‌ స్ట్రక్చర్స్‌ తయారీలో వీటిని వినియోగించేందుకు వీలుంటుందని తెలియజేసింది. ఈ ప్రొడక్టులు గరిష్ట వేడిమిని తట్టుకుంటాయని, సీల్‌ విషయంలోనూ అత్యంత నాణ్యతను కలిగి ఉంటాయని తెలియజేసింది. ఈ నేపథ్యంలో కాస్మో ఫిల్మ్స్‌ షేరు ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం 2 శాతం లాభంతో రూ. 240 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 243 వద్ద గరిష్టాన్నీ, రూ. 237 వద్ద కనిష్టాన్నీ తాకింది. కంపెనీలో ప్రమోటర్లకు 43 శాతం వాటా ఉంది.Most Popular