జెట్‌ ఎయిర్‌వేస్‌, అశోక్‌ లేలాండ్ అప్‌!! 

జెట్‌ ఎయిర్‌వేస్‌, అశోక్‌ లేలాండ్ అప్‌!! 

ఇటీవల ఆర్థిక సమస్యల్లో చిక్కుకున్న విమానయాన ప్రయివేట్‌ రంగ సంస్థ జెట్‌ ఎయిర్‌వేస్‌ అన్‌ఆడిటెడ్‌ ఫలితాల విడుదలకు రంగం సిద్ధం చేసినట్లు ప్రకటించడంతో వెలుగులోకి వచ్చింది. మరోవైపు బంగ్లాదేశ్‌ నుంచి భారీ సంఖ్యలో బస్సుల కోసం ఆర్డర్‌ పొందినట్లు వెల్లడించడంతో హిందుజా గ్రూప్‌ ఆటో దిగ్గజం అశోక్‌ లేలాండ్ కౌంటర్‌సైతం బలాన్ని పుంజుకుంది. 

జెట్‌ ఎయిర్‌వేస్‌:
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక ఫలితాల విడుదలను ఈ నెల 27న విడుదల చేయనున్నట్లు వెల్లడించడంతో విమానయాన రంగ ప్రయివేట్‌ సంస్థ జెట్‌ ఎయిర్‌వేస్‌ కౌంటర్‌ బలపడింది. ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో ఈ షేరు 1.6 శాతం పెరిగి రూ. 305 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 309 వద్ద గరిష్టాన్నీ, రూ. 303 వద్ద కనిష్టాన్నీ తాకింది. ఈ నెల  27న బోర్డు సమావేశంకానున్నట్లు జెట్‌ ఎయిర్‌వేస్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు తెలియజేసింది. కాగా... భాగస్వామ్య సంస్థ జెట్‌ ప్రివిలేజ్‌లో వాటాను పీఈ దిగ్గజం బ్లాక్‌స్టోన్‌కు విక్రయించనున్న వార్తలతో గురువారం సైతం జెట్‌ ఎయిర్‌వేస్‌ కౌంటర్‌ లాభపడిన సంగతి తెలిసిందే. జెట్‌ ఎయిర్‌వేస్‌ వాటాకు రూ. 3,000-4,000 కోట్లవరకూ లభించవచ్చని మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి.

అశోక్‌ లేలాండ్: 
బంగ్లాదేశ్‌ రహదారులు రవాణా సంస్థ(బీఆర్‌టీసీ) నుంచి ఆర్డర్ పొందిన వార్తలతో దేశీ ఆటో రంగ దిగ్గజం అశోక్‌ లేలాండ్ కౌంటర్‌ వెలుగులోకి వచ్చింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు దృష్టి సారించడంతో ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో ఈ షేరు దాదాపు 2 శాతం ఎగసి రూ. 129 వద్ద ట్రేడవుతోంది. కంపెనీలో ప్రమోటర్లకు 51 శాతంపైగా వాటా ఉంది. మొత్తం 300 బస్సుల సరఫరా కోసం బీఆర్‌టీసీ నుంచి కాంట్రాక్ట్‌ లభించినట్లు కంపెనీ పేర్కొంది. ఢాకా రోడ్లపై ట్రాఫిక్‌ భారీగా పెరిగిపోవడంతో డబుల్‌ డెక్కర్‌ బస్సులకు కాంట్రాక్ట్‌ లభించినట్లు వివరించింది. 8 నెలల్లోగా బస్సులను సరఫరాను పూర్తిచేయనున్నట్లు తెలియజేసింది. ఈ టెండర్‌ను ఇండియన్‌ లైన్‌ ఆఫ్‌ క్రెడిట్‌కింద దక్కించుకున్నట్లు తెలియజేసింది.Most Popular