ఐటీసీ- ఫలితాలూ, రేటింగ్‌ బూస్ట్‌!

ఐటీసీ- ఫలితాలూ, రేటింగ్‌ బూస్ట్‌!

ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం ఐటీసీ లిమిటెడ్‌ కౌంటర్‌లో ర్యాలీ కొనసాగుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2018-19) తొలి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించడంతోపాటు.. ఇటీవల ఈ స్టాక్‌కు బ్రోకింగ్‌ సంస్థలు కొనుగోలు(బయ్‌) రేటింగ్‌ను ఇవ్వడంతో ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. ఫలితంగా గత నెల రోజుల్లో ఈ కౌంటర్‌ 17 శాతం లాభపడింది. ఇదే సమయంలో సెన్సెక్స్‌ 4 శాతమే పుంజుకుంది. ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో ఐటీసీ షేరు దాదాపు 2 శాతం పెరిగి రూ. 313 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 315 వరకూ ఎగసింది. ఇది 52 వారాల గరిష్టంకాగా.. రూ. 308 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని సైతం చవిచూసింది. 
ఫలితాలతో
ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్‌-జూన్‌)లో ఐటీసీ నికర లాభం 10 శాతం పుంజుకుని రూ. 2819 కోట్లను తాకింది. కంపెనీ అగ్రి బిజినెస్‌, ఎఫ్ఎంఎసీజీ, హోటళ్లు తదితర సిగరెట్లేతర విభాగాల్లోనూ మంచి పనితీరు చూపుతుండటంతో ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. అయితే మొత్తం ఆదాయం మాత్ర నామమాత్ర క్షీణతతో  రూ. 206 కోట్లకు పరిమితమైంది. 
రేటింగ్‌
ఇటీవల పలు బ్రోకింగ్‌ సంస్థలు ఐటీసీ షేరుకి బయ్‌ రేటింగ్‌ను ప్రకటించాయి. ఏడాది కాలానికి రూ. 350-367 మధ్య టార్గెట్‌ ధరను సైతం ప్రకటించాయి. జీఎస్‌టీ తరువాత అటు సిగరెట్ల బిజినెస్‌తోపాటు ఇటు ఎఫ్‌ఎంసీజీ, హోటళ్లు, అగ్రి విభాగాలు పటిష్ట వృద్ధిని సాధిస్తున్నట్లు బ్రోకింగ్‌ సంస్థ కేఆర్‌ చోక్సీ ఇన్‌స్టిట్యూషనల్‌ పేర్కొంది. మరోవైపు జీఎస్‌టీ అమలు తరువాత సిగరెట్ల బిజినెస్‌ ఊపందుకున్నదని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ సైతం అభిప్రాయపడింది.Most Popular