సెన్సెక్స్‌ ట్రిపుల్‌- మెటల్‌, ఫార్మా జూమ్‌!!

సెన్సెక్స్‌ ట్రిపుల్‌- మెటల్‌, ఫార్మా జూమ్‌!!

ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు కలిగిన అమెరికా, చైనా మధ్య ఎట్టకేలకు వాణిజ్య వివాదాలకు చెక్‌ పెట్టే ప్రయత్నాలు ప్రారంభంకావడంతో దేశీ స్టాక్‌ మార్కెట్లు జోరుగా సాగుతున్నాయి. అమెరికా, యూరప్‌, ఆసియా మార్కెట్లు సైతం లాభపడటంతో దేశీయంగానూ ఇన్వెస్టర్లకు హుషారొచ్చింది. దీంతో ట్రేడింగ్ ప్రారంభంలోనే లాభాల డబుల్‌ సెంచరీ సాధించిన సెన్సెక్స్‌ ప్రస్తుతం ట్రిపుల్‌ను సైతం కొట్టింది. 310 పాయింట్లు జంప్‌చేసి 37,974కు చేరింది. ఈ బాటలో నిఫ్టీ 91 పాయింట్లు ఎగసి 11,476 వద్ద ట్రేడవుతోంది. 
అన్ని రంగాలూ లాభాల్లోనే
ఎన్‌ఎస్‌ఈలో అన్ని రంగాలూ లాభపడగా.. మెటల్‌, ఫార్మా 1.5 శాతం చొప్పున ఎగశాయి. ఈ బాటలో బ్యాంక్‌ నిఫ్టీ, ఎఫ్‌ఎంసీజీ, ఆటో, రియల్టీ 1 శాతం స్థాయిలో బలపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో గ్రాసిమ్‌, లుపిన్‌, టాటా స్టీల్‌, కొటక్‌ బ్యాంక్‌, వేదాంతా,  అదానీ పోర్ట్స్‌, టైటన్‌, యస్‌బ్యాంక్‌, టాటా మోటార్స్‌,  డాక్టర్‌ రెడ్డీస్‌ 3-2 శాతం మధ్య లాభపడ్డాయి. కేవలం గెయిల్‌, ఎయిర్‌టెల్‌, ఓఎన్‌జీసీ, పవర్‌గ్రిడ్‌ 1.5-0.5 శాతం మధ్య నీరసించాయి. ఇక డెరివేటివ్‌ స్టాక్స్‌లో కేడిలా హెల్త్‌, కేన్‌ఫిన్‌, బ్యాంక్‌ ఆప్‌ ఇండియా, అరబిందో, నాల్కో, అపోలో హాస్పిటల్స్‌, స్టార్‌, ఐడీఎఫ్‌సీ, జిందాల్‌ స్టీల్‌ 4-3 శాతం మధ్య జంప్‌చేశాయి. మరోపక్క రెప్కో హోమ్‌, బలరామ్‌పూర్‌, ఫెడరల్ బ్యాంక్‌, బాలకృష్ణ, మైండ్‌ట్రీ 2-1 శాతం మధ్య నష్టపోయాయి. 
చిన్న షేర్లు జోరు
మార్కెట్లు ఊపందుకోవడంతో చిన్న షేర్లకూ డిమాండ్‌ పెరిగింది. బీఎస్ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ ఇండెక్సులు దాదాపు 1 శాతం స్థాయిలో పుంజుకున్నాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో ఏకంగా 1626 లాభపడగా.. 614 మాత్రమే నష్టాలతో కదులుతున్నాయి.



Most Popular