డబుల్‌ సెంచరీతో షురూ- అన్ని రంగాలూ!!

డబుల్‌ సెంచరీతో షురూ- అన్ని రంగాలూ!!

ఎట్టకేలకు వాణిజ్య వివాదాలకు చెక్‌ పెట్టే ప్రయత్నాలు ప్రారంభంకావడంతో దేశీ స్టాక్‌ మార్కెట్లు జోరందుకున్నాయి. ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు కలిగిన అమెరికా, చైనా మధ్య  వచ్చే వారం చర్చలు మొదలుకానుండటంతో ప్రపంచవ్యాప్తంగా సెంటిమెంటు బలపడింది. దీంతో అమెరికా, యూరప్‌, ఆసియా మార్కెట్లు లాభపడగా.. దేశీయంగానూ ఇన్వెస్టర్లకు హుషారొచ్చింది. వెరసి ట్రేడింగ్ ప్రారంభంలోనే సెన్సెక్స్‌ లాభాల డబుల్‌ సెంచరీ సాధించింది. ప్రస్తుతం 228 పాయింట్లు జంప్‌చేసి 37,891కు చేరింది. నిఫ్టీ సైతం 63 పాయింట్లు ఎగసి 11,448 వద్ద ట్రేడవుతోంది. 
ప్లస్‌లో
ఎన్‌ఎస్‌ఈలో అన్ని రంగాలూ లాభపడగా.. మెటల్‌, పీఎస్‌యూ బ్యాంక్స్‌ 1.2 శాతం చొప్పున ఎగశాయి. ఈ బాటలో ఫార్మా, ఎఫ్‌ఎంసీజీ, రియల్టీ, ఆటో 0.7 శాతం స్థాయిలో బలపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో గ్రాసిమ్‌, వేదాంతా, హిందాల్కో, టాటా స్టీల్‌, యస్‌బ్యాంక్‌, ఐటీసీ, డాక్టర్‌ రెడ్డీస్‌, ఇన్‌ఫ్రాటెల్‌, బజాజ్‌ ఫిన్‌, అదానీ పోర్ట్స్‌ 2-1 శాతం మధ్య లాభపడ్డాయి. అయితే కేవలం బజాజ్‌ ఆటో, ఎయిర్‌టెల్‌, టెక్ మహీంద్రా 0.5 శాతం స్థాయిలో నిరసించాయి. ఇక డెరివేటివ్‌ స్టాక్స్‌లో బ్యాంక్‌ ఆప్‌ ఇండియా, కేడిలా హెల్త్‌, నాల్కో, హెచ్‌సీసీ, బాలకృష్ణ ఇండస్ట్రీస్‌, జిందాల్‌ స్టీల్‌, యూనియన్‌ బ్యాంక్‌, ఎన్‌ఎండీసీ 3-2 శాతం మధ్య జంప్‌చేశాయి.
చిన్న షేర్లు జోరు
మార్కెట్లు ఊపందుకోవడంతో చిన్న షేర్లకూ డిమాండ్‌ పెరిగింది. బీఎస్ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ ఇండెక్సులు 0.7 శాతం స్థాయిలో పుంజుకున్నాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో ఏకంగా 1101 లాభపడగా.. 301 మాత్రమే నష్టాలతో కదులుతున్నాయి.Most Popular